వారిపై చర్యలు తప్పవు: హోంమంత్రి అనిత వార్నింగ్, రోజాకు కౌంటర్
తిరుపతి: రాష్ట్రంలో ఆడ పిల్లల రక్షణలో తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వడమలపేట మండల ఘటన జరిగిన 48 గంటలలోనే నిందితులను పట్టుకొని తగిన సాక్ష్యాధారాలతో రిమాండ్‌కు తరలించారని తెలిపారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసు అధికారులతో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. మహిళలు, చిన్నారుల దాడులపై ప్రత్యేక సూచనలు చేశారు.
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగదారులపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. చట్ట వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపాలని దిశానిర్దేశం చేశారు. పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారని మంత్రి అనిత తెలిపారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు పెద్ద పీట వేస్తున్నామన్నారు.

విజయవాడ వరదల్లో ఎవరు కష్టపడ్డారో ప్రజలకు తెలుసని అన్నారు. మాజీ మంత్రి రోజాకు వీలుంటే క్షేత్రస్థాయి పరిశీలనకు రావచ్చన్నారు. రెడ్‌బుక్‌లో తమ పేర్లు ఉన్నాయని వైసీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
మరోవైపు, వడమాలపేట మండలంలో హత్యాచారానికి గురైన చిన్నారి తల్లిదండ్రులను మంత్రి అనిత పరామర్శించారు. రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందజేసి చిన్నారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. నిందితుడికి 2 నుంచి 3 నెలల్లో కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు మంత్రి హామీ ఇచ్చారు. చిన్నారిపై హత్యాచారం కలిచివేసిందన్నారు. వడమలపేట మండల ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా ఉందన్నారు.
చిన్నారి కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు మంత్రి అనిత. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. ఎక్కడ ఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని, చిన్నపిల్లల మరణాల్ని వైఎస్సార్సీపీ రాజకీయం చేయడం బాధాకరమన్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదన్నారు. గత పాలనలో మద్యం ఏరులై పారిన తీరు రోజాకు తెలియలేదా? అని ప్రశ్నించారు. మద్యంపై రోజా చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదంగా ఉందన్నారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని అనిత మండిపడ్డారు. హత్యాచార ఘటనల కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని అనిత తెలిపారు.
గత ప్రభుత్వంలో అనేక హత్యాచారాలు జరిగాయని, అప్పుడు రాని వారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ లబ్ది కోసం పాకులాడడం సరైనది కాదన్నారు. చిన్నారుల మరణాలను రాజకీయంగా వాడుకునే రాబందులు ఉన్నారని వైసీపీ నేతలనుద్దేశించి హోంమంత్రి అనిత మండిపడ్డారు.












Click it and Unblock the Notifications