బీజేపీ "పద్మ"వ్యూహం లో టీడీపీ - ఎన్నికల వేళ "మెగా" స్కెచ్..!!
ఏపీలో ఎన్నికల సమరం ఆసక్తి కరంగా మారుతోంది. జగన్ ఇతర పార్టీల కంటే ముందుగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. టీడీపీ, జనసేన మధ్య సీట్ల చర్చలు జరుగుతున్నాయి. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఏపీలో బీజేపీ ఏం చేయబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఉందనే చర్చ మొదలైంది.
పద్మవిభూషణ పురస్కారం:ఏపీలో సినీ- రాజకీయ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కూడా దేశంలో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. దేశంలో ఐదుగురికి అత్యున్నత రెండో పురస్కారమైన పద్మవిభూషణ్ లభించగా అందులో ఇద్దరు మన తెలుగు రాష్ట్రానికి చెందిన వారే. ఇద్దరికీ ఈ అత్యున్నత పురస్కారం దక్కటం పట్ల వెంకయ్య నాయుడు స్పందించారు. చాలా గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్న తనకు ఈ అవార్డు దక్కిందన్నారు. భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చేందుకు అందరం కృషి చేద్దాం. మాతృభూమి సేవకు పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. 150కి పైగానే సినిమాల్లో నటించిన చిరంజీవికి అత్యున్నత పురస్కారం 'పద్మవిభూషణ్' దక్కింది.

కేంద్రం నిర్ణయంపై హర్షం:పద్మవిభూషణ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు చిరంజీవి. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తనను సొంతమనిషిలా.. తమ అన్నయ్యలా, తమ బిడ్డలా భావించే కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండల వల్లే తను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానన్నారు చిరంజీవి. తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అన్నారు. తనను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఏపీలో కొనసాగుతున్న ఎన్నికల రాజకీయం వేళ ప్రతీ నిర్ణయం రాజకీయ కోణంలోనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన ఏపీలో టీడీపీలో పొత్తు ప్రకటించింది. బీజేపీ తమతో కలిసి రావాలని టీడీపీ, జనసేన కోరుతున్నాయి. కానీ, బీజేపీ నుంచి వీరి ప్రతిపాదన పైన అధికారికంగా నిర్ణయం వెల్లడి కాలేదు.
రాజకీయంగా ప్రభావం ఉండేనా:ఇక, ఈ సారి పవన్ కల్యాణ్ తో పొత్తు ద్వారా కాపు సామాజిక వర్గం మద్దతు తమ వైపు తిప్పుకోవాలనేది చంద్రబాబు వ్యూహం. టీడీపీకి తొలి నుంచి మద్దతుగా నిలుస్తుందనే మరో ప్రధాన సామాజిక వర్గం ఆ పార్టీకే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలోనే పురందేశ్వరిని బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా నియమించింది. తెలంగాణలో బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ ద్వారా ఓట్లు, సీట్లు పెరిగినట్లు బీజేపీ గుర్తించింది. దీంతో, ఏపీలో సొంతంగా ఎదగటానికి ఇక్కడ సామాజిక సమీకరణాలే కీలకం కావటంతో కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. తమిళనాడులో ఎన్నికల వేళ రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి కొందరు గుర్తు చేస్తున్నారు. బీజేపీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా..రాజకీయ కోణం ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు పవన్ టీడీపీతో వెళ్తున్న వేళ.. టీడీపీ సామాజిక సమీకరణాలకు చెక్ పెట్టేలా ఏపీలో పక్కా వ్యహంతో బీజేపీ రాజకీయ "పద్మ" వ్యూహం అమలు చేస్తుందనే విశ్లేషణలు తెర మీదకు వచ్చాయి.












Click it and Unblock the Notifications