పవన్ కళ్యాణ్ ఫ్యాన్ హత్య: ఇలాంటి అభిమానం నాకొద్దు.. జూ.ఎన్టీఆర్ ఉద్వేగం
విజయవాడ: ఇటీవల జనసేన పార్టీ అధినేత వవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్‌ను మరో టాప్ హీరో అభిమాని కత్తితో పొడిచి చంపాడు. ఇది కలకలం రేపింది. కత్తితో పొడిచి చంపిన ఆ వ్యక్తి జూ.ఎన్టీఆర్ అభిమానిగా వార్తలు వచ్చాయి.
దీనిపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అతను ఓ ప్రయివేటు న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై వ్యాఖ్యానించారు. హద్దులు దాటే అభిమానులు తనకు వద్దని అతను ఉద్వేగంగా స్పందించారు.

మితిమీరిన అభిమానం తనకు అవసరం లేదని, ఎవరికైనా మొదట మనం పుట్టిన ఈ భూమి పైన, దేశం మీద, ఆ తర్వాత తల్లిదండ్రుల మీద, భార్యా పిల్లల మీద, శ్రేయోభిలాషుల మీద ఉండాలన్నారు. ఆఖరుకు నా మీద ప్రేమ చూపించాలన్నారు.
తమకు మితిమీరిన కోపాలు (హీరోలలో హీరోలపై ఎవరికీ కోపాల్లేవు) ఎవరి పైన లేవని వ్యాఖ్యానించారు. ఆ స్థాయికి మీరు కూడా ఎవరు వెళ్లవద్దన్నారు. మా మీద మీకు ప్రేమ ఉండటం చాలా మంచిది, మా అదృష్టమన్నారు. కానీ మా మీద ప్రేమ ఆఖరి ప్రేమ కావాలన్నారు.
సినీ హీరోలపై అభిమానం తప్పు కాదని, ఆ అభిమానం హద్దులు దాటకూడదని సూచించారు. అభిమానం ఎల్లప్పుడూ పరిమితుల్లోనే ఉండాలని చెప్పారు. ముందు దేశం, తర్వాత కుటుంబం, ఆ తర్వాతే సినీ హీరోలపై అభిమానం చూపాలని చెప్పారు. గొడవలకు వెళ్లే వారు నా అభిమానులుగా ఉండవద్దన్నారు.
సినీ హీరోలుగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని ఆయన చెప్పారు. భవిష్యత్తులోనూ హీరోల మధ్య ఎలాంటి గొడవలు ఉండబోవని చెప్పారు. కాగా, కర్ణాటకలోని కోలార్‌లో ఇటీవల జరిగిన ఘర్షణలో జూ.ఎన్టీఆర్ అభిమానుల దాడిలో పవన్ కళ్యాణ్ అభిమాని హత్యకు గురైన విషయం తెలిసిందే. చనిపోయిన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని పవన్ ఇటీవల తిరుపతిలో పరామర్శించారు.












Click it and Unblock the Notifications