హోదా కోసం అడిగితే కులం ఏంటి, ఇంకా ఎన్ని రోజులు: ఊగిపోయిన శివాజీ
అమరావతి: ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న తన కులం, అసలు తాను ఎవడినని కొందరు ప్రశ్నిస్తున్నారని నటుడు, హోదా ఉద్యమ నాయకుడు శివాజీ బుధవారం నాడు వాపోయారు. 'జాబు కావాలంటే ప్రత్యేక హోదా కావాలి' అనే నినాదం ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కులాలను మనమే సృష్టించుకున్నామని, దానిపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. హోదా కోసం పోరాడుతుంటూ మధ్యలో ఈ కులం ఎందుకు వచ్చిందని నిలదీశారు. హోదా విషయంలో అన్ని అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.
హోదాతో లాభం లేదంటూ, హోదాకు సమానమైన సాయం చేస్తామని చెబుతున్నారని, ఇలాంటి మాటలు ఇంకా ఎన్ని రోజులు చెబుతారని ప్రశ్నించారు. ఇతర దేశాలకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిధులు ఇచ్చారని, మనకీ అంతేనా అన్నారు.

తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఆ రోజు హోదా ఇస్తాం, తెస్తామని చెప్పాయని గుర్తు చేశారు. హోదతో పరిశ్రమలు రావని కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు చెప్పడం విడ్డూరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా కోసం ప్రజలతో చర్చించాలన్నారు.
మళ్లీ వచ్చే ఎన్నికల సమయంలోను ప్రత్యేక హోదా గురించే మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఉన్న పలు రాష్ట్రాలకే ఆ హోదాను తీసేస్తున్నారని చెబుతున్నారని, వాటి సమయం అయిపోయింది కాబట్టి తీసేస్తున్నారని, ఆ రాష్ట్రాలతో లింక్ పెట్టడం సరికాదన్నారు.
రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉన్న ఎవరు కూడా హోదాను వదులుకోరని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరోక్షంగా చురకలు అంటించారు. తనలా ప్రశ్నించేవారిని తిడుతున్నారన్నారు. తప్పుడు ప్రచారాలతో తమను విమర్శిస్తున్నారన్నారు.
మన ఆత్మగౌరవం గురించి చలసాని శ్రీనివాస్ పోరాడుతున్నారని, అలాంటి వ్యక్తిని విమర్శించడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం నెలకొల్పుతున్నారని, పోలవరం ప్రాజెక్టు పేరిట డ్రామాలు ఆడుతున్నారన్నారు.
పోలవరానికి చల్లబద్ధత కల్పించేటప్పుడు ఎన్నో లింకులు పెడతారని, ప్యాకేజీతో మభ్యపెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. హోదా వస్తే ఉద్యోగాలు రావని చెప్పడం ఏమిటన్నారు. తాము శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నామని, అయినా తమ పైన పడటం ఏమిటన్నారు. హోదా వల్ల రాష్ట్రానికి రూ.60 వేల కోట్ల ప్రయోజనం ఉందన్నారు.












Click it and Unblock the Notifications