ఆ హక్కు మాకెక్కడిది- ఒప్పుకున్న నాగబాబు
అమరావతి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి మధ్య జరిగిన సమావేశంపై చెలరేగిన దుమారం తగ్గట్లేదు. రోజురోజుకూ మరింత ముదురుతోంది. తెలుగుదేశం, జనసేన పార్టీ ఈ భేటీని సమర్థించుకుంటోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని చెబుతోన్నాయి.

వైసీపీ అటాక్..
పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీపై వైఎస్ఆర్సీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అమ్ముడుపోయాడని, ప్యాకేజీలను తీసుకుంటోన్నాడంటూ ధ్వజమెత్తుతున్నారు. తాను ప్యాకేజీ స్టార్ అనే విషయాన్ని పవన్ కల్యాణ్ తనకు తానుగా మరోసారి నిరూపించుకున్నాడనీ ఎద్దేవా చేస్తోన్నారు. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టాడంటూ మండిపడుతున్నారు.

రామ్ గోపాల్ వర్మ అదే దారిలో..
చంద్రబాబు- పవన్ కల్యాణ్ సమావేశంపై అటు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా దండెత్తడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనదైన శైలిలో సెటైర్లు సంధిస్తోన్నారాయన. దీనిపై రెండురోజుల పాటు వరుసగా ట్వీట్లు చేశారు. ఇదివరకు ఆయన చంద్రబాబును సైతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిలదీశారు. కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు సభల్లో సంభవించిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది దుర్మరణంపాలు కావడం పట్లా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

నాగబాబు కౌంటర్ అటాక్..
పవన్ కల్యాణ్‌పై అధికార పార్టీ నాయకులు, రామ్ గోపాల్ వర్మ చేస్తోన్న మాటల దాడిని ఆయన సోదరుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాగబాబు తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఎదురుదాడికి దిగారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై ఘాటు విమర్శలు చేశారు. కాపు సామాజిక వర్గం ఓటుబ్యాంక్‌పైనా ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

తాతలు వచ్చి ఇచ్చారా..?
పవన్ కల్యాణ్ నుంచి పవన్ కల్యాణ్ ప్యాకేజీని తీసుకుంటోన్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన విమర్శలను నాగబాబు తప్పుపట్టారు. వాళ్ల తాతలు వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఏవైనా ప్యాకేజీ ఇచ్చారా? అంటూ నిలదీశారు. పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల మేర రెమ్యునరేషన్‌ను తీసుకుంటాడని, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్టు ప్యాకేజీ కోసం పాకులాడాల్సిన అవసరం పవన్‌కు లేదని అన్నారు.

ఆ హక్కు మాకెక్కడిది..
వైఎస్ఆర్సీపీ నాయకులు కాపు సామాజిక వర్గం ఓటుబ్యాంక్‌పై చేసిన విమర్శలను కూడా నాగబాబు తోసిపుచ్చారు. ఆ హక్కు తమకు లేదని తేల్చిచెప్పారు. కాపు కులాన్ని గానీ, ఆ సామాజిక వర్గ ఓటుబ్యాంకును గానీ ఒకరికి తాకట్టు పెట్టే హక్కు తమకు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన రామ్ గోపాల్ వర్మపై ఘాటు విమర్శలు చేశారు. రిప్ కాపులు అంటూ ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications