ఏపీలో మహిళలకు 18 వేల పథకం ఎప్పుడు ?
ఏపీలో ఏడాదిన్నర క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కూటమి అధినేతగా చంద్రబాబు మహాశక్తి గ్యారంటీలో భాగంగా ఇచ్చిన ఆడబిడ్డ నిధి పథకం ఇప్పటివరకూ అమలు కాలేదు. వరుసగా రెండోఏడాది కూడా ఈ పథకం అమలు చేయకపోవడంపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రెండేళ్లు కావస్తున్నా మహాశక్తి పథకానికి అతి గతి లేదన్నారు.
పండుగల పేరు చెప్పి కాలయాపన తప్ప మహిళా సాధికారితపై చంద్రబాబుకు కమిట్మెంట్ లేదన్నారు.
ఈ పథకం కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఒకరు, మహిళలు రెడీగా ఉండమని మరొకరు.. దీపావళి, సంక్రాంతికి ఇస్తామని ఇంకొకరు ఆడబిడ్డల మనోభావాలతో ఆటలాడుతున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. ఆడబిడ్డ నిధి పేరుతో కోటిన్నర మంది రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు చేసింది ఘరానా మోసమే అన్నారు. నెలకిచ్చే 15 వందలతో ఏడాదికి 18 వేలు చేస్తాం అన్నారని, 18 వేలను లక్షా 50 వేలకు ఆదాయం పెంచే మార్గం చూపుతాం అన్నారని గుర్తుచేశారు.

మహిళల అభివృద్ధికి పెద్దపీట అంటూ చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి బూటకపు మాటలే అన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి ప్రధాన హామీ అని, 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆర్థికంగా భరోసా నిచ్చే హామీ అని అన్నారు. ప్రతి ఏడాది 18 వేలు లబ్ధి చేకూరే పథకానికి రెండేళ్లుగా పంగనామాలు పెడుతూ .. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలన్నారు. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పాలన్నారు. నచ్చినప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు అమలు చేసేవి కావు ఎన్నికల హామీలు అన్నారు. మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications