బాలినేని వల్లే మంత్రి పదవి-విభేదాలు మీడియా సృష్టే-ఆదిమూలపు సంచలన కామెంట్స్
ఏపీలో తాజా కేబినెట్ విస్తరణతో తెరపైకి వచ్చిన ప్రకాశం జిల్లా మంత్రుల విభేదాలు ఇవాళ మరో మలుపు తీసుకున్నాయి. జగన్ కేబినెట్ ప్రక్షాళనలో ప్రకాశం జిల్లా నుంచి తనను తొలగించాల్సి వస్తే మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ను కూడా తప్పించాలని బాలినేని శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. కానీ జగన్ మాత్రం సురేష్ ను కొనసాగించారు. దీంతో అలిగిన బాలినేనని జగన్ పిలిపించుకుని బుజ్జగించి పంపారు.
కేబినెట్ ప్రక్షాళన నేపథ్యంలో బాలినేని శ్రీనివాసులురెడ్డితో తనకు విభేదాలు ఉన్నాయంటూ జరిగిన ప్రచారంపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రి బాలినేనితో తన విభేదాలు మీడియా సృష్టేనన్నారు. బాలినేని వల్లే తనకు మంత్రి పదవి వచ్చిందని ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. బాలినేని నాయకత్వంలో జిల్లాల కలిసి పనిచేస్తానని కూడా సురేష్ పేర్కొన్నారు. దీంతో మంత్రి సురేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఉన్న ఇరువురు మంత్రుల్లో ఒకరిని తొలగించి మరొకరిని కొనసాగిస్తుండటంపై వైసీపీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. జిల్లా వైసీపీ పగ్గాలు తన చేతిలోనే ఉన్నప్పటికీ మంత్రి పదవి లేకపోతే ఇబ్బందులు తప్పవని బాలినేని భావిస్తున్నారు. దీంతో ఆదిమూలపు సురేష్ కు బాలినేని నాయకత్వంలోనే పనిచేయాలని అధిష్టానం నుంచి సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన బాలినేనితో విభేదాలపై మీడియాలో క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటికి అంతా సాఫీగా ఉన్నట్లు కనిపిస్తున్నా జిల్లాలో ఈ సఖ్యత ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications