కుటుంబ చరిత్రలతో రా! భూమా అంతే: ఆది సవాల్, 'జగన్ వస్తే రక్షణ కష్టమే'
నంద్యాల బహిరంగ సభలో వైసిపి అధినేత వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఆయనపై నిప్పులు చెరిగారు. మంత్రులు వేర్వేరుగా జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: నంద్యాల బహిరంగ సభలో వైసిపి అధినేత వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఆయనపై నిప్పులు చెరిగారు. మంత్రులు వేర్వేరుగా జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోటస్‌పాండులో సిద్ధమా?
వైయస్ జగన్, శిల్పా కుటుంబ చరిత్రలతో పాటు తమ కుటుంబ చరిత్రపై బహిరంగ చర్చకు సిద్ధమని, ధైర్యం ఉంటే చర్చకు రమ్మని మంత్రి ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. బహిరంగ చర్చ ఎక్కడ పెట్టాలో జగన్ చెప్పాలని, లోటస్ పాండులో అయినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
Recommended Video


మీలాగే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా 25 ఏళ్ల వయస్సులోనే
జగన్ తన పార్టీలో ఉంటే ఒక విధంగా వేరొక పార్టీలో ఉంటే మరో విధంగా మాట్లాడుతారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. 1978లో 25 ఏళ్ల వయస్సులో వైయస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారని, 28 ఏళ్లలో జగన్ ఎంపీగా ఎన్నికయ్యారని, నేడు భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా మీ మాదిరే ఎన్నికై పనులు చేస్తాడన్నారు. రూ.2 లక్షల కోట్లు దాచుకున్న జగన్ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.

అభివృద్ధిపై ఆ మాటకు కౌంటర్
నంద్యాల సభలో వైసిపి అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను ఈసీ చూసుకుంటుందని మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అవినీతి కేసుల్లో ఉన్న జగన్ ధర్మం, న్యాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నంద్యాల ఉప ఎన్నికను వైసిపి డబ్బుమయం చేస్తోందన్నారు. ఉప ఎన్నిక లేకపోతే నంద్యాలలో అభివృద్ధి జరిగేదా అని ప్రతిపక్షం విమర్శిస్తోందని, ముఖ్యమంత్రి లేకపోయినా జూన్ 19న అర్బన్ హౌసింగ్ మొదలు పెట్టింది గుర్తు లేదా అని ప్రశ్నించారు.

వైసిపిని కాల్చేందుకు ప్రజలు సిద్ధం
భూమా నాగిరెడ్డి ఆశయాన్ని నెరవేరుస్తామని సోమిరెడ్డి అన్నారు. టిడిపిపై దుష్ప్రచారం చేయడమే వైసిపి పనిగా పెట్టుకుందన్నారు. జగన్‌కు ఫ్యాక్షన్ ఇంకా పోలేదన్నారు. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చాలన్న జగన్ వ్యాఖ్యలు దారుణమన్నారు. బ్యాలెట్ రూపంలో వైసిపిని కాల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ నెల 23వ తేదీ నంద్యాల ఉప ఎన్నికల్లో తేల్చుకుంటామన్నారు.

ఎన్నికల సంఘం చూసుకుంటుంది
జగన్ కుల కక్షలను ప్రోత్సహిస్తున్నారని చినరాజప్ప అన్నారు. జగన్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం చూసుకుంటుందన్నారు. జగన్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. టిడిపి నైతికతను దెబ్బతీసేందుకు వారు ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రజలకు రక్షణ కష్టమన్నారు.












Click it and Unblock the Notifications