టీడీపీ-బీజేపీ పొత్తు-బద్వేల్ పోరుతో మరోసారి తెరపైకి తెచ్చిన వైసీపీ-జగన్ అసలు వ్యూహం ఇదే ?
ఏపీతో పాటు కేంద్రంలో బీజేపీతో జట్టుకట్టేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకునే పరిస్ధితుల్లో టీడీపీ కనిపించడం లేదు. తాజాగా రాష్ట్రంలో పట్టాభి ఎపిసోడ్ తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని పెద్దల్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించిన చంద్రబాబుకు వెంటనే ఆ అవకాశం లభించలేదు. అయితే బద్వేల్ ఉపఎన్నికలో లక్ష మెజారిటీకి ప్రయత్నించి విఫలమైన అధికార వైసీపీ మాత్రం ఆ కోపాన్ని టీడీపీకి బీజేపీకి లింక్ చేస్తూ తీర్చుకుంటోంది. దీంతో టీడీపీ కోరుకున్నట్లే వైసీపీ మరోసారి ట్రాప్ లో పడుతున్నట్లు అవుతోంది.

బీజేపీతో పొత్తుకు టీడీపీ తహతహ
ఏపీలో ఆ మాట కొస్తే కేంద్రంలోనూ బీజేపీతో పొత్తు కోసం టీడీపీ తహతహలాడుతోంది. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలోనూ అధికారాన్ని పంచుకున్న టీడీపీ గత ఎన్నికల్లో ఆ పొత్తు లేకే ఓడిపోయినట్లు భావిస్తోంది. ఫామ్ లో ఉన్న బీజేపీతో ఈసారైనా పొత్తు పెట్టుకుంటే తప్ప ఏపీలో గట్టెక్కడం కష్టమేనని భావిస్తున్న టీడీపీ.. అందుకోసం చేయని ప్రయత్నం లేదు. తాజాగా సీఎం జగన్ పై తమ పార్టీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యల ఎపిసోడ్ ను వాడుకుంటూ కేంద్రానికి దగ్గరయ్యేందుకు మరోసారి టీడీపీ విఫలయత్నం చేస్తోంది. అయినా బీజేపీ వెంటనే కనికరించే పరిస్ధితి లేదు.

టీడీపీని కనికరించని బీజేపీ
గతంలో తమతో కలిసి పోటీ చేసి అధికారాన్ని అనుభవించిన తర్వాత దూరం కావడంతో పాటు ధర్మపోరాటం కూడా చేసిన టీడీపీని అంత సులువుగా తిరిగి అక్కున చేర్చుకిునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఒకవేళ చేర్చుకున్నా ఇప్పుడు కాదు ఎన్నికలు రావాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో టీడీపీకి తాత్కాలిక ఊరట కూడా దక్కడం లేదు. తాజాగా పట్టాభి ఎపిసోడ్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్ని కేంద్రానికి ఫిర్యాదు పేరుతో ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ నేతలకు దగ్గరవుదామని భావించిన చంద్రబాబుకు నిరాశ తప్పలేదు. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోగా.. హోంమంత్రి అమిత్ షా సైతం కశ్మీర్ పర్యటనలో ఉండి తర్వాత కలుద్దామని చెప్పి పంపేశారు. దీంతో చంద్రబాబు ఒట్టి చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది.

టీడీపీ ప్రయత్నాలకు వైసీపీ సహకారం
బీజేపీకి దగ్గరయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న టీడీపీని తిరిగి బీజేపీకి దగ్గర చేసేందుకు వైసీపీ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ టీడీపీని దూరం పెడుతున్నా వైసీపీ మాత్రం పదే పదే టీడీపీ-బీజేపీ సహకారించుకుంటున్నారనే అంశాన్ని తెరపైకి తెస్తోంది. తద్వారా వారికి ప్రస్తుతం లేని సఖ్యతను అంటగడుతోంది. అసలే బీజేపీకి దగ్గరయ్యేందుకు చూస్తున్న టీడీపీ వైసీపీ వ్యాఖ్యల్ని స్వాగతిస్తోంది. వైసీపీ చేస్తున్న ఈ ప్రచారం అంతిమంగా తమకు మేలు చేస్తుందని భావిస్తోంది. తాజాగా బద్వేలు ఉపఎన్నికలో టీడీపీ-బీజేపీ సహకరించుకున్నాయంటూ వైసీపీ మొదలుపెట్టిన ప్రచారంపై ఇరుపార్టీలు నోరు మెదపడం లేదు.

చంద్రబాబు కోరుకున్నట్లే
అసలే బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్న వేళ.. వైసీపీ చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు టీడీపీ శిబిరంలో సంతోషం నింపుతున్నాయి. వెతకబోయిన తీగ కాలికే తగిలినట్లు తాము కోరుకున్నట్లే బీజేపీతో తమను లింక్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండటంతో ఆ విధంగా అయినా బీజేపీకి దగ్గరవుతున్నామని టీడీపీ సంబరపడుతోంది. ఇదే అదనుగా బీజేపీ నేతల్ని రెచ్చగొట్టి వైసీపీపై విమర్శలు చేయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మరో విధంగా చెప్పాలంటే చంద్రబాబు కోరుకున్నట్లుగానే టీడీపీ-బీజేపీని లింక్ చేస్తూ వైసీపీ చేస్తున్న విమర్శలు భవిష్యత్తులో ఇరు పార్టీల్ని కలిపినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.
Recommended Video

జగన్ అసలు ప్లాన్ ఇదేనా ?
బద్వేల్ ఉపఎన్నికలో టీడీపీ-బీజేపీ సహకరించుకున్నాయంటూ వైసీపీ నేతలు, సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గతంలోనూ పలుమార్లు టీడీపీ-బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయంటూ వైసీపీ నేతలు విమర్శలు చేశారు. దీంతో వీరిద్దరూ కలవాలని వైసీపీ కోరుకుంటుందా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది. మరి ఈ విమర్శల వెనుక ఏముందని ఆరా తీస్తే.. వీరిద్దరిని కలుపుతూ వైసీపీ చేసే విమర్శలకు కచ్చితంగా బీజేపీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. గతంలో టీడీపీ తమకు దూరమయ్యాక.. వైసీపీ, టీడీపీ ఒక్కటేనని క్లారిటీ ఇస్తున్న బీజేపీ నేతలు.. ఇప్పుడు వైసీపీ విమర్శలకు స్పందించాల్సి వస్తోంది. దీంతో ఇద్దరూ తోడు దొంగలంటూ వైసీపీ విమర్శలు చేసినప్పుడల్లా టీడీపీతో తాము కలిసేది లేదంటూ బీజేపీ స్పష్టం చేస్తోంది. అప్పుడు చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా మారుతున్నాయి. వైసీపీ కోరుకుంటోంది కూడా ఇదేనన్న చర్చ జరుగుతోంది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications