రాష్ట్రంలో మారుతున్న సీన్ ! వైసీపీ అలర్ట్- రంగంలోకి జగన్, సాయిరెడ్డి, వైవీ..!
ఏపీలో తాజా ఎన్నికల ఫలితాల చేదు అనుభవాలు మర్చిపోక ముందే విపక్ష వైసీపీ పెను సవాల్ ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో అధికార మార్పిడి నేపథ్యంలో వైసీపీ నుంచి ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున పార్టీ ఫిరాయించేందుకు సిద్దమవుతున్నారన్న సమాచారంతో ఆ పార్టీ కీలక నేతలు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే వరుసగా ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
రాష్టంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఓ ఎత్తయితే, వచ్చిన సీట్ల సంఖ్య మరీ దారుణంగా ఉండటంతో వైసీపీ వేగంగా తమను నమ్ముకున్న ప్రజాప్రతినిధుల్లో నమ్మకం కోల్పోతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇన్నాళ్ళూ పదవుల కోసం, అధికారం కోసం జగన్ తో పాటు వైసీపీ పెద్దల చుట్టూ చక్కర్లు కొట్టిన వారంతా ఇప్పుడు ఆ పార్టీని ఎప్పుడు వదిలించుకుందామా అన్న ఆలోచనలో కనిపిస్తున్నారు. దీంతో వీరిని వచ్చే ఐదేళ్లపాటు కాపాడుకోవడం జగన్ కు తలకు మించిన భారంగా మారుతోంది.

రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం, అందులో మూడు పార్టీలు నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే క్రమంలో విపక్ష వైసీపీని నామరూపాల్లేకుండా చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీ, ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులపై ఫోకస్ పెట్టాయి. సాధ్యమైనంత ఎక్కువ మందిని తమవైపు తిప్పుకోవడం లేదా వైసీపీకి దూరం చేసేయడం ద్వారా రాష్ట్రంపై రాజకీయంగా పూర్తి పట్టు సాధించాలనే ఆలోచనలో కనిపిస్తున్నాయి. దీంతో తమ వద్ద మిగిలిన ప్రజాప్రతినిధుల్ని కాపాడుకోవడం వైసీపీకి సవాల్ గా మారింది.
ఇందులో భాగంగానే వైఎస్ జగన్ తాజాగా ఎమ్మెల్సీల భేటీ నిర్వహించారు. ఇవాళ ఎంపీలతో భేటీ అవుతున్నారు. అటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఎంపీలతో భేటీ అయి వారిని కలిపి ఉంచేలా పావులు కదుపుతున్నారు. మరోవైపు విశాఖలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సైతం జీవీఎంసీ కార్పోరేటర్లతో భేటీ అయి పార్టీలోనే ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొందరు మాత్రం ఇప్పటికే అధికార కూటమితో టచ్ లోకి వెళ్లిపోవడం, త్వరలో వైసీపీకి దూరం కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications