రామోజీరావు కోడలు శైలజను విచారిస్తున్న ఏపీ సీఐడీ-మార్గదర్శి కేసులో..
ఏపీ, తెలంగాణలో మార్గదర్శి చిట్స్ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఇవాళ సంస్ధ ఎండీ శైలజా కిరణ్ ను విచారిస్తున్నారు. ఇప్పటికే మార్గదర్శి కేసులో పలువురు బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేయడంతో పాటు రామోజీరావు ఆస్తుల్ని సైతం అటాచ్ చేసిన సీఐడీ..ఇప్పుడు శైలజా కిరణ్ పై దృష్టిసారిస్తోంది. గతంలో శైలజపై సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేయగా.. తెలంగాణ హైకోర్టు వాటిని రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రామోజీ రావు నివాసానికి వెళ్లి విచారణ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మార్గదర్శి సంస్ధల లావాదేవీలకు సంబంధించి శైలజాకిరణ్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం జూబ్లీహిల్స్ రామోజీరావు నివాసానికి చేరుకున్న ఏపీ సిఐడి అధికారులు.. అక్కడే విచారణ చేపట్టారు.వీడియో, ఫూట్ కెమెరాలతో పాటు ప్రింటర్స్ తో సిఐడి బృందాలు చేరుకున్నట్లు తెలుస్తోంది.

శైలజా కిరణ్ పై విచారణలో చందాదారుల నగదు ఎక్కడికి తరలించారు అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.రామోజీ గ్రూప్ కంపెనీలకు ఫండ్స్ మళ్లించినట్టు గుర్తించిన సీఐడీ అధికారులు... పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థకు చెందిన ఆస్తులను ఇటీవలే సీఐడీ అటాచ్ కూడా చేసింది. మార్గదర్శికి సంబంధించిన రూ.793.50కోట్ల విలువైన చరాస్తులను అటాచ్ చేశారు.
శైలజా కిరణ్ పై విచారణ తర్వాత మరిన్నిఆస్తుల్ని అటాచ్ చేసేందుకు సీఐడీ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్గదర్శి చిట్స్ అక్రమాల కేసులపై విచారణను తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో తెలంగాణ హైకోర్టు పరిధిలోనే ఏపీ సీఐడీ కేసులపై నిర్ణయాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications