చంద్రబాబుకు కన్నుకొడుతూ... జగన్ ను రెచ్చగొడుతూ- కాషాయ జిత్తులు-స్పందిస్తే అంతే సంగతులు
దేశవ్యాప్తంగా ప్రాంతీయ రాజకీయ పార్టీల్ని తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవడం, వదిలేయడం అలవాటుగా మార్చుకుంటున్న బీజేపీ ఏపీలో మరో రాజకీయ క్రీడకు తెరదీస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా బీజేపీ ఇస్తున్న సంకేతాలు చూస్తుంటే గతంలో ఆడిన గేమ్ మరోసారి రిపీట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు అర్దమవుతోంది. దీంతో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ అప్రమత్తమవుతున్నాయి. అదే సమయంలో బీజేపీకి దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఆడబోయే గేమ్ ప్లాన్ ఆసక్తి రేపుతోంది.

ఏపీలో బీజేపీ రాజకీయం
ఏపీలో గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని పలుమార్లు కేంద్రంలో అధికారం అందుకోవడంతో పాటు రాష్ట్రంలోనూ భారీగా లబ్ది పొందిన బీజేపీ.. తమ అవసరం తీరిపోగానే మాత్రం ఆ పార్టీని వదిలించేసుకుంది. దీనికి తగ్గట్టుగానే టీడీపీ కూడా అవసరాల కోసమే బీజేపీ అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో వీరిద్దరి మధ్య బంధం తామరాకు మీద నీటి బొట్టులా కనిపిస్తుంటుంది. మధ్యలో 2019 ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ దారుణంగా నష్టపోవడంతో వైసీపీని ఆదరిస్తున్నట్లు కనిపిస్తున్న బీజేపీ.. సరైన సమయం చూసి ఆ పార్టీని కూడా టార్గెట్ చేస్తోంది. దీంతో బీజేపీని ఏమీ అనలేక జగన్ కూడా మౌనం వహిస్తున్నారు.

చంద్రబాబుకు కన్నుకొడుతూ
ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో ఏదో విధంగా తమ ఉనికి చాటుకోవాలంటే టీడీపీతో బంధం తప్పనిసరని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూడేళ్లుగా చంద్రబాబును పూర్తిగా దూరం పెట్టిన బీజేపీ నేతలు.. ముందస్తు ఎన్నికలకు సంకేతాలు వెలువడుతున్న వేళ తిరిగి చంద్రబాబుకు ఆహ్వానాలు పలుకుతున్నారు. అవసరం లేకపోయినా చంద్రబాబు మద్దతు తీసుకుంటూ జగన్ ను చికాకు పెడుతున్నారు.దీంతో చంద్రబాబు కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. ప్రధాని మోడీ భీమవరం టూర్ తో మరసారి చిగురించిన బీజేపీ-టీడీపీ స్నేహం ఎన్నికల నాటికి ఏ రేంజ్ కు వెళ్తుందో ఇప్పటికైతే చెప్పలేని పరిస్ధితి.

జగన్ ను రెచ్చగొడుతూ..
చంద్రబాబును దగ్గర తీసుకుంటున్న ప్రభావమో.. లేక వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న సంకేతాల ప్రభావమో తెలియదు కానీ జగన్ ను మాత్రం బీజేపీ నేతలతో మొదలుపెట్టి కేంద్ర మంత్రుల వరకూ అంతా టార్గెట్ చేస్తున్నారు. అటు పార్లమెంటులో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న కేంద్రం.. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్రమంత్రుల సాయంతో అవినీతి ఆరోపణలు చేయిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పర్యటనలో చేసిన విమర్శలు చూస్తుంటే బీజేపీ అధిష్టానం జగన్ విషయంలో రూటు మారుస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే వీటిపై జగన్ మాత్రం పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. అలాగే తన పార్టీ నేతలతో కూడా కౌంటర్లు ఇప్పించడం లేదు. ఇదంతా చూస్తుంటే వ్యూహాత్మకంగా సాగుతున్న రాజకీయమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ స్పందిస్తే 2018 సీన్ రిపీట్ ?
రాష్ట్రంలో బీజేపీ నేతలతో మొదలుపెడితే కేంద్రమంత్రుల వరకూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే పనిలో పడ్డారు. రాష్ట్రంలో వీలు చిక్కినప్పుడల్లా మతపరమైన అంశాల్ని కెలుకుతున్నారు. మరోవైపు జగన్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే పరిస్దితి లేదు. దీంతో రాష్ట్రంలో ఉనికి చాటుకోవాలంటే తమకున్న చివరి ఆప్షన్ టీడీపీతో పొత్తుగా భావిస్తున్న బీజేపీ నేతలు తాజాగా జగన్ ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ ట్రాప్ లో పడకుండా జగన్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కానీ ఎన్నికల నాటికి బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వక తప్పని పరిస్ధితులు ఎదురుకావొచ్చు. అప్పుడు జగన్ ఎలా స్పందిస్తారన్న దానిపై భవిష్యత్ రాజకీయాలు ఆధారపడతాయి. ఒకవేళ జగన్ ట్రాప్ లో పడి చంద్రబాబు కేంద్రంపై గతంలో రెచ్చిపోయిన విధంగా ఇప్పుడు జగన్ కూడా రెచ్చిపోతే మాత్రం పరిస్ధితులు ఒక్కసారిగా మారిపోవడం ఖాయం. అలా జరక్కుండా జగన్ ఎంత సంయమనం పాటిస్తారన్న దానిపైనే 2024లో వైసీపీ విజయావకాశాలు ఆధారపడతాయనేది వాస్తవం.












Click it and Unblock the Notifications