జగన్ అవసరం బీజేపీకి ఇక లేదా - తాజా ఫలితాలతో కొత్త ఈక్వేషన్లు : రఘురామకు రిలీఫ్..!!
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలోనే కాదు. ఏపీ రాజకీయాల పైన ప్రభావం చూపనున్నాయి. 2019 ఎన్నికల ముందు నాటి కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వచ్చింది. బయటకు వచ్చేలా చేయటంలో నాడు జగన్ వ్యూహం సక్సెస్ అయింది. జగన్ ట్రాప్ లో చిక్కుకున్న టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఆ సమయం నుంచి వైసీపీ- బీజేపీ అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. అప్పటికే అవసరమైన ప్రతీ సందర్బంలోనూ అనధికార మిత్రపక్షంగా పార్లమెంట్ లోనూ సహకారం అందిస్తోంది. నాడు జరిగిన రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్ధులకు మద్దతు ఇచ్చింది. ఇక, 2019 లో జగన్ సీఎం అయిన తరువాత కేంద్రంతోనూ ప్రత్యేకించి ప్రధాని మోదీ - అమిత్ షా తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.

నాటి నుంచి సత్సంబంధాలు
ఆశించిన స్థాయిలో ఏపీకి కేంద్రం నుంచి సహకారం అందటం లేదనే అభిప్రాయం ఉన్నా.. రాష్ట్రంలో నెలకొన్ని ఆర్దిక - పరిపాలనా అవసరాల రీత్యా కేంద్రంతో సఖ్యతగానే ఉంటున్నారు. పోలవరం సవరించిన అంచనాల ఆమొదం కోసం ఎన్ని సార్లు కోరినా..ఇప్పటి వరకు అనుమతి లభించ లేదు. ఇక, చివరకు ఢిల్లీ కేంద్రంగా తమను డామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న తమ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ పైన చర్యల కోసం పదే పదే కోరినా.. చర్యలు తీసుకోకపోవటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే అనర్హత వేటు కోసం ఆధారాలు ఇచ్చినా..చర్యలు లేకపోవటం తో వారు అసహనానికి లోనవుతున్నారు. ఇక, రఘురామ ఏకంగా వైసీపీ నేతలు తన పైన అనర్హత వేటు కోసం ప్రయత్నాలు చేసుకోవాలని సవాల్ చేస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో అవసరం లేదా
ఈ పరిస్థితుల్లో మరి కొద్ది రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు రానున్నాయి. ఆ సమయంలో మిత్రపక్షాలు దూరమైన వేళ..వైసీపీ మద్దతు బీజేపీకి అవసరం అవుతుందని ఇప్పటి దాకా భావించారు. దీంతో..తమ మద్దతు కావాల్సిన సమయంలో కొన్ని కండీషన్లు పెట్టేందుకు వైసీపీ సిద్దం అయిందనే చర్చ మొదలైంది. కానీ, ఇప్పుడు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాస్ట్రపతి ఎలక్ట్రోల్ ఓట్లలో యూపీ ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. ఇక, యూపీతో పాటుగా మరో మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి రావటంతో..వైసీపీ మద్దతు లేకుండానే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తమ బలంలోనే రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకొనే అవకాశం ఏర్పడింది.

వైసీపీతో ఎలా వ్యవహరిస్తారు
దీంతో.. వైసీపీ తమ డిమాండ్లను బీజేపీ ముందు బలంగా వినిపించే అవకాశం కోల్పోయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో.. తాజా ఫలితాలతో జాతీయ స్థాయిలో బీజేపీ బలం ఏంటనేది స్పష్టత వచ్చింది. ప్రధాని మోదీ సైతం ఇవే ఫలితాలు 2024 ఎన్నికల్లో రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. దీంతో..ఇప్పుడు ఇటు వైసీపీ పైన కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన డిమాండ్ల కోసం ఒత్తిడి పెంచుతూనే..బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు మరింత పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాజా ఫలితాలతో జనసేన సైతం బీజేపీతోనే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఏపీలో రాజకీయంగా బీజేపీకి బలం లేకపోయినా.. వైసీపీకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఈ ఫలితాల తరువాత ఉండదని విశ్లేషకుల అభిప్రాయం.
Recommended Video

జగన్ కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది..
దీంతో..రఘురామ కు సైతం మరింత సమయం దొరికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆయన ఈ ఫలితాలు రిలీఫ్ గా అభివర్ణిస్తున్నారు. ఇక, అయిదు రాష్ట్రాల ఫలితాల తరువాత జమిలి ఎన్నికల దిశగానూ కేంద్రం అడుగులు వేసే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు జగన్ నిర్ణయం కీలకం కానుంది. జమిలికి మద్దతుగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారా.. పూర్తి సమయం ప్రభుత్వం కొనసాగిస్తారా అనేది చూడాలి. ఎన్నికల్లో మాత్రం జగన్ ఒంటరిగానే పోటీ చేయటం ఖాయం. కానీ, జగన్ ను ఎదుర్కోవటానికి ప్రతిపక్షాలు ఏకం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో..ఇప్పుడు తాజా ఎన్నికల ఫలితాలతో జాతీయ స్థాయిలోనే కాకుండా.. ఏపీలోనూ కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఈ సమయంలో జగన్ ఎటువంటి అడుగులు వేస్తారనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications