వైసీపీ నో టికెట్- టీడీపీకి మరో అభ్యర్ధి దొరికాడోచ్..!
ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు పలు నియోజకవర్గాల్లో విపక్ష టీడీపీకి వరంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే అభ్యర్ధులు ఖరారైన నియోజకవర్గాలతో పాటు ఇప్పటివరకూ ఇన్ ఛార్జ్ లను ఖరారు చేయని నియోజకవర్గాల్లోనూ కొత్త అభ్యర్ధులు దొరుకుతున్నారు. దీంతో టీడీపీ ఆ మేరకు హ్యాపీగా కనిపిస్తోంది. అంతే కాదు వీరికి టికెట్లు ఖరారు చేసేందుకు ప్రకటనను కూడా వాయిదా వేసుకుంటూ వస్తోంది.
తాజాగా రాయలసీమలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నందికొట్కూరులో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే తొగురు ఆర్ధర్ కు ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా మరోసారి అవకాశం దక్కలేదు. తాజాగా ప్రకటించిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో నందికొట్కూరుకు డాక్టర్ సుధీర్ కు అవకాశం కల్పించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆర్ధర్ కు సీటు దక్కదని తేలిపోయింది. దీంతో వైసీపీపై ఆగ్రహంగా ఉన్న ఆయన సీఎం జగన్ తో పాటు నియోజకవర్గంలో తనకు ఇబ్బందిగా మారిన బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్టిపై విమర్శలు ఎక్కుపెట్టారు.

పేరుకే తాను ఎమ్మెల్యే అని, పెత్తనం అంతా బైరెడ్డిదేనని ఆర్ధర్ తెలిపారు. ఈ విషయం అడిగినందుకు తనకు టికెట్ నిరాకరించారన్నారు. చాలా దళిత నియోజకవర్గాల్లో ఇదే పరిస్ధితి ఉందన్నారు. తనకు అధికారమిస్తేనే టికెట్ ఇవ్వమని జగన్ ను కోరినట్లు ఆర్ధర్ వెల్లడించారు. నాలుగేళ్లుగా మిమ్మల్నే నమ్ముకున్నాను, నా మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోమని చెప్పానన్నారు. తన గ్రాఫ్ బాగానే ఉందని ఐప్యాక్ ప్రతినిధులు, జిల్లా సమన్వయకర్త కూడా చెప్పారని, అయినా టికెట్ ఇవ్వలేదని ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు.
నందికొట్కూరు నుంచి టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే ఆర్ధర్ ఇప్పుడు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. రేపు కార్యకర్తలతో భేటీ ఏర్పాటు చేసిన ఆర్ధర్.. టీడీపీలో చేరికను ప్రకటించే అవకాశం ఉంది. తనను పొమ్మనలేక పొగబెట్టిన వైసీపీకి షాకిచ్చేలా టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధి కావాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి ఓటేయాలని తనను ప్రలోభపెట్టినట్లు ఆర్ధర్ వెల్లడించారు. టీడీపీకి కూడా ఇక్కడ బలమైన అభ్యర్ధి లేకపోవడంతో ఆర్ధర్ ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications