వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మంచి విషయం చెప్పారు: అచ్చన్న, మండిపడిన పత్తిపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ శాసన సభలో అగ్రిగోల్డ్ అంశంపై సోమవారం నాడు రభస జరిగింది. ఈ అంశంపై శాసన సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం సాయంత్రం చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసిపి అధినేత జగన్, మంత్రులు అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావుల మధ్య వాగ్వాదం జరిగింది.

జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు దోషులను శిక్షించాల్సింది పోయి, కాపాడుతున్నారని ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అగ్రిగోల్డ్ స్కాం జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు దాదాపు 40 లక్షల మంది ఉన్నారని, ఆ సంస్థ రూ.10వేల కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించిందన్నార.

అగ్రిగోల్డ్ మోసం నేపథ్యంలో ఏజెంట్లు ఊళ్లు వదిలి పోవాల్సి వస్తుందని, వందమందికి పైగా ఏజెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిని నెరవేర్చడం లేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని కూడా చంద్రబాబు చెప్పారన్నారు.

ఈ సందర్భంగా బెంగాల్లోని శారదా స్కాంతో అగ్రిగోల్డ్ స్కాంను జగన్ పోల్చారు. 2014లో అగ్రిగోల్డ్ స్కాంపైన కేసు నమోదయిందన్నారు. అగ్రిగోల్డ్ నిందితులను అరెస్టు చేయవద్దని సాక్షాత్తు సిఐడి అధికారులే చెప్పారని జగన్ అన్నారు. నిందితుల్ని కాపాడేందుకు చంద్రబాబు సీఐడీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. సిబిఐతో విచారణ ఎందుకు జరిపించలేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డుకు 8 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారని చెప్పారు.

దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... అగ్రిగోల్డ్ 1995లో ప్రారంభమైందని చెప్పారు. అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వాల తప్పు లేదన్నారు. కానీ ముఖ్యమంత్రులను పిలిచి, సినిమా తారలను పిలిచి అగ్రిగోల్డ్ తమ వ్యాపారాన్ని బాగా విస్తరింప చేసిందన్నారు.

అగ్రిగోల్డ్ వంద కోట్ల రూపాయల వ్యాపారం చేసిందన్నారు. బాధితులను ఆదుకునేందుకే సిఐడి విచారణకు ఆదేశించామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన గత పదేళ్లలోనే అగ్రిగోల్డ్ ప్రజలను మభ్యపెట్టి భారీగా వసూలు చేసిందన్నారు. అగ్రిగోల్డ్ కేవలం ఏపీకి చెందినదే కాదన్నారు. మూడు నాలుగు రాష్ట్రాలకు చెందినదని చెప్పారు.

చంద్రబాబు ముద్దాయిలను రక్షిస్తున్నారని చెప్పడం దారుణమన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఆస్తులను జఫ్తు చేశామన్నారు. పేపర్లో వచ్చిన వార్త ఆధారంగా తమ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించామని చెప్పారు. అగ్రిగోల్డ్ అంశం కోర్టులో ఉందని చెప్పారు.

దీనిపై కోర్టుకు లేఖ రాసి, ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసే దిశగా తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్తులను జఫ్తు చేశామని, ఆస్తుల వేలం ద్వారా బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. సిబిఐ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు. సత్వర న్యాయానికి విపక్షం సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు.

జగన్ మాట్లాడుతూ.. ప్రసంగం నాదా లేక అచ్చెన్నాయుడిదా అర్థం కాకుండా ఉందని ఎద్దేవా చేశారు. వివరణ ఇచ్చేందుకు అధికార పక్షం ఎక్కువ సమయం తీసుకుంటోందన్నారు.

జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేసే అవసరం లేదని సీఐడీ అధికారులో హైకోర్టుకు చెప్పారని, ఇది విడ్డూరమన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అగ్రిగోల్డ్ కేసును నీరుగారుస్తున్నారని పలువురు బాధితులు కోర్టుకెక్కారన్నారు.

విచారణ జరుగుతుండగానే ఆస్తులు అమ్మేశారని విమర్శించారు. మొన్నటి దాకా వైస్ చైర్మన్‌గా సీతారాంను అరెస్టు చేయలేదన్నారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ గ్రూప్ సంస్థలను కూడా జగన్ ప్రస్తావించారు.

Agri Gold scam rocks AP Assembly, YS Jagan questions AP CM Chandrababu

జగన్ మంచి విషయాలు చెబుతున్నాడు..

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జగన్ మంచి విషయాలు చెబుతున్నాడు బాగానే ఉందని చెప్పారు. అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి ఏ వ్యక్తుల పేర్లు జగన్ వద్ద ఉన్నా తమకు సమాచారం ఇవ్వవచ్చునని చెప్పారు. జగన్ ఇప్పుడు చదివిన పేర్లే కాకుండా, ఇంకా లింక్ డాక్యుమెంట్లు ఉన్నా మాకు ఇవ్వాలన్నారు.

జగన్ మాట్లాడుతూ... అగ్రిగోల్డ్ గ్రూప్ సంస్థలకు చెందిన ఉదయ్ దినకర్ వద్ద పత్తిపాటి పుల్లారావు కుటుంబం స్థలం కొందని చెప్పారు.

నా పేరు లేకుంటే నిద్రపట్టదు: పత్తిపాటి

దీనిపై మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. మేం అగ్రిగోల్డ్ సంస్థలకు చెందిన ఆస్తులు, అగ్రిగోల్డు లింక్ ఆస్తులు కానీ కొన్నట్లుగా జగన్ నిరూపిస్తే.. తన ఆస్తులన్నీ జగన్‌కు రాసిస్తానని పత్తిపాటి పుల్లారావు చెప్పారు. సాక్షి మీడియా అవినీతి పత్రిక, ఛానల్ అన్నారు. నా గురించి రాయకుండా సాక్షికి నిద్ర పట్టదన్నారు. జగన్‌కు కూడా నిద్ర పట్టదన్నారు.

నీలా ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడాల్సిన అవసరం నాకు లేదని పత్తిపాటి ధ్వజమెత్తారు. జగన్ నిత్యం అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు నమ్మరని చెప్పారు. జగన్ వద్ద ఎన్ని పత్రాలు ఉన్నాయో, మా వద్ద కూడా అన్ని పత్రాలు ఉన్నాయన్నారు. తాము కొన్న భూములను కూడా లీగల్‌గా కొన్నామని చెప్పారు.

అగ్రిగోల్డ్ లేదా అగ్రిగోల్డ్ గ్రూపుకు చెందిన ఆస్తులను మేం కొన్నట్లు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమన్నారు. తాము భూములు కొన్న మాట వాస్తవమని, కానీ వాటికి అగ్రిగోల్డుతో సంబంధం లేదన్నారు. జగన్‌లా నేను బినామీలా సృష్టికర్తను కాదన్నారు. బినామీలు తనకు అవసరం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో అగ్రిగోల్డ్ పెరిగిందన్నారు. సోనియా వద్దకు కూడా అగ్రిగోల్డ్ మేనేజ్‌మెంటును దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తీసుకెళ్లారన్నారు. అగ్రిగోల్డు కంపెనీ పేరు మీద వైయస్ హయాంలో ఎన్నింటిని కట్టబెట్టారో చూసుకోవచ్చన్నారు.

అగ్రిగోల్డు బాధితులను కచ్చితంగా తమ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. ఇది కాంగ్రెస్ పాలన కాదన్నారు. జగన్ వాస్తవాలు మాట్లాడలని, అబద్దాలు మాట్లాడవద్దన్నారు. గతంలో రాజధాని భూములంటూ నాపై జగన్ ఆరోపించారని, కానీ సవాల్ చేస్తే పారిపోయావన్నారు. ఈ రోజు అగ్రిగోల్డ్ లింక్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజైనా జగన్ తాను చేసే సవాల్ పైన నిలబడాలన్నారు. తాను అగ్రిగోల్డ్ ఆస్తులు కొన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు.

దీనిపై జగన్ మాట్లాడుతూ... మంత్రిగారు ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు సంతోషమన్నారు. (అయితే, అవి అగ్రిగోల్డ్‌కు సంబంధం లేని ఆస్తులు అని పత్తిపాటి చెప్పారు). మంత్రికి అమ్మిన ప్రాపర్టీ అగ్రిగోల్డ్ అటాచ్‌లో లేదని చెప్పారు.

English summary
Agri Gold scam rocks AP Assembly, YS Jagan questions AP CM Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X