ప్రతిజ్ఞ చేసిన నారా లోకేష్- రాష్ట్ర ప్రజలకు ఓపెన్ లెటర్..!!
యువగళం పేరుతో నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర నేపథ్యంలో- నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. పాదయాత్ర చేపట్టడానికి గల కారణాలను ఇందులో వివరించారు. అందరి గొంతుకను తానే అవుతానని హామీ ఇచ్చారు.
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్- సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతోన్నారు. యువ గళం పేరుతో కాలినడకన రాష్ట్రం మొత్తాన్నీ చుట్టేయనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సుమారు 4,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. 400 రోజుల పాటు ఆయన జనం మధ్యే ఉండబోతోన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఆయన లక్ష్యం.
ఎల్లుండి మధ్యాహ్నమే..
ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం నుంచి తొలి అడుగు వేయనున్నారు నారా లోకేష్. లక్ష్మీపురంలోని శ్రీ ప్రసన్న వరదరాజస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఇదే నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. తొలి రోజు 8.3 కిలోమీటర్ల మేర నడుస్తారు. పీఈఎస్ మెడికల్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటుచేసిన శిబిరంలో బస చేస్తారు. శాంతిపురం, గుడుపల్లి, కుప్పం, రామకుప్పంల్లో ప్రజలను ముఖాముఖి కలుసుకుంటారు. 29వ తేదీన పలమనేరు నియోజకవర్గంలో ప్రవేశిస్తారు.

కుప్పానికి బయలుదేరిన లోకేష్..
పాదయాత్ర కోసం నారా లోకేష్ ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లోని తన నివాసం నుంచి కుప్పానికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు-భువనేశ్వరికి పాదాభివందనం చేశారు. వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. బ్రాహ్మణి తిలకం దిద్ది, హారతి పట్టారు. అత్తామామ బాలకృష్ణ, వసుంధర, ఇతర నందమూరి కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. గుమ్మం వద్ద నారా లోకేష్ కు చంద్రబాబు ఎదురొచ్చారు. ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు.

బహిరంగ లేఖ..
ఈ నేపథ్యంలో నారా లోకేష్.. రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రెండు పేజీల లేఖ ఇది. ఇందులో అనేక అంశాలను క్లుప్తంగా ప్రస్తావించారు. పాదయాత్ర చేపట్టడానికి గల కారణాలను స్పష్టంగా వివరించారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని ఇందులో ఎక్కడా పొందుపర్చలేదు గానీ- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు.

ఒక్క ఛాన్స్ అంటూ..
ఒక్క ఛాన్స్ అంటూ కాళ్లా వేళ్లా పడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి- విధ్వంస పాలన సాగిస్తోన్నాడని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ బాదుడే బాదుడు పాలనలో బాధితులు కానివారు లేరని తేల్చి చెప్పారు. కార్మికులు, కర్షకులు, కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు.. మాకొద్దీ అరాచకపాలన అంటూ ఆందోళన వ్యక్తం చేస్తోన్నారని అన్నారు.

నియంత కంటే ఘోరంగా..
జగన్ పరిపాలన నియంత కంటే ఘోరంగా, రాక్షస పాలనను కొనసాగిస్తోన్నారని, ప్రశ్నించే ప్రతిపక్షంపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని, మహిళల మానప్రాణాలు దైవాధీనం అయ్యాయని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కులం, మతం, ప్రాంతాల పేరుతో విధ్వేషాలను ఎగదోస్తోన్నారని, వికృత రాజకీయానికి తెర లేపారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను తన ప్రైవేటు సైన్యంగా వాడుతున్నారని మండిపడ్డారు.

గద్దె దింపుదాం..
జగన్ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దింపుదామని, ఇందుకు కలిసి రావాలని నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతన్నను రాజుగా చూసేంత వరకు తాను విశ్రమించేది లేదని ప్రతిజ్ఞ చేశారు. బాధితుల తరఫున ఉద్యమించాలని నిర్ణయించుకున్నానని, తనకు సహకరించాలని కోరారు. యువతకు భవితనవుతానని, అభివృద్ధికి వారధిగా నిలుస్తానని చెప్పారు. ఆడబిడ్డలకు సోదరుడిగా, అవ్వాతాతలకు మనవడిగా బాగోగులు చూస్తానని హామీ ఇచ్చారు. ఒక దళంగా, బలంగా యువగళం పాదయాత్రను నడిపించాలని కోరారు.












Click it and Unblock the Notifications