వారు దూరం: కిరణ్‌కు జెసి ఝలక్, చిరు ఎమ్మెల్యేకూడా
హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. ఆయన పలువురు సీనియర్లతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే, కొత్త పార్టీ ఇప్పుడు అవసరం లేదని, తాము పార్టీలే చేరమని కిరణ్‌కు కొందరు షాకిస్తున్నారు. కిరణ్‌తో రెండు దఫాలుగా సమావేశమైన మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి.. ఇప్పుడు పార్టీ పెడితే లాభమేంటని ప్రశ్నించారు.

సమైక్యవాదం కోసం పోరాడినందుకు వ్యక్తిగత ప్రతిష్ఠ పెరిగింది తప్ప అది ఓట్లుగా మారే అవకాశం ఉందా, విభజన జరిగిపోయిన నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటుతో పెద్దగా ఒరిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు. కొత్త పార్టీలోకి తాను రానని తేల్చి చెప్పారు. అలాగే, తాను ఇంకా కాంగ్రెస్‌కు రాజీనామా చేయలేదని, పార్టీని వీడే అంశంపై నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడాలని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి కిరణ్‌కు స్పష్టం చేశారు.
తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు విశ్వాసపాత్రుడినన్న విషయం బహిరంగ రహస్యమేనని, కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావుతో మాట్లాడిన తర్వాతే పార్టీపై ఓ నిర్ణయం తీసుకుంటానని పాలడుగు వెంకట్రావు చెప్పారు. నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే వంగా గీత వివరించారు. కొత్త పార్టీని ఏర్పాటు చేయాలన్న దృఢసంకల్పం కిరణ్‌లో కనిపిస్తోందని, ఉండవల్లి అరుణ్ కుమార్, నియోజకవర్గ ప్రజలతో సంప్రదించి దీనిపై తాను నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ రావు చెప్పారు.

అయితే, ఎంపీలు మాత్రం కిరణ్ కొత్త పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యమంగా హర్ష కుమార్, సబ్బం హరి లాంటి ఎంపీలు కొత్త పార్టీ పెట్టాలని చెబుతున్నారు. కిరణ్ వినిపించిన సమైక్యవాదానికి సీమాంధ్రలో ప్రయోజనం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలులో మాట్లాడుతూ కిరణ్ పార్టీ పెట్టరన్నారు.
మరోవైపు, మొదటి నుండి కిరణ్‌కు అండగా ఉన్న మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాస రావులు ఇప్పుడు దూరంగా ఉన్నారు. వారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ నెల 27న టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ప్రకటించే అవకాశముంది.












Click it and Unblock the Notifications