తుపానుగా బలపడిన వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుపానుగా బలపడింది. దీనికి 'రెమాల్' అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారింది. ఆదివారం అర్థరాత్రికి బంగ్లాదేశ్ లోని ఖెపుపరా, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.
కళ్యాణదుర్గంలో అత్యధికంగా..
ఏపీ సహా త్రిపుర, మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, మేఘాలయ, అండమాన్, నికోబార్ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అప్రమత్తం చేసింది. గుంటూరు, కృష్ణా, అనంతపురం, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ వాన పడింది. కళ్యాణదుర్గం మండలంలో 86.4 మిల్లీమీటర్లు, కణేకల్లులో 70 మిల్లీమీటర్లు, ఉరవకొండలో 62 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
ఈదురు గాలులకు కంబదూరు, ఉరవకొండ, నార్పల, శెట్టూరు, బెళుగుప్ప, కళ్యాణదుర్గం, యల్లనూరు, యాడికి, పెద్దపప్పూరు, బ్రహ్మసముద్రం, పెద్దవడుగూరు మండలాల్లో బొప్పాయి, అరటి పంటలు దెబ్బతిన్నాయి. టమాటా పంట సైతం నేలకొరిగింది. మడకశిర మండలంలో 72.2 మిల్లీమీటర్లు, కనగానపల్లి మండలంలో 63 మిల్లీమీటర్ల చొప్పున వాన పడింది.
మడకశిర, తాడిమర్రి మండలాల్లో అరటి, దానిమ్మ దెబ్బతిన్నాయి. ఈరోజు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications