ఏపీలో మరో రెండురోజులపాటు భారీ వర్షాలు: ప్రజలకు అలర్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచించింది. మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఈ క్రమంలో రెండు రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం వాయుగుండగా మారి.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని చెప్పారు.
భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు వరదనీటితో నిండుకుండల్లా మారాయి. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీ వరద కొనసాగుతోంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద పెరిగింది. మళ్లీ రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో చెరువులు, వాగులు, నదులు పొంగిపొర్లే అవకాశం ఉంది. దీంతో ప్రభావిత, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications