శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ దర్శనాలు రద్దు..
తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమల ఆలయంలో టూరిజం కార్పొరేషన్లకు కేటాయిస్తున్న శ్రీవారి దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తుంటారు.
ఆలయంలో భక్తుల కోసం వీఐపీ దర్శనం, స్పెషల్ ఎంట్రీ, సర్వదర్శనం తదితర విధానాల్లో ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. అయితే, ఈ దర్శనాలతో పాటు ఆలయంలో వివిధ రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కేటాయిస్తూ వచ్చేవారు. కానీ, ఈ దర్శనాలను ఇప్పడు రద్దు చేస్తున్నట్లు టీటీడీ నూతన పాలకమండలి ప్రకటించింది.

టూరిజం కార్పొరేషన్లకు కేటాయిస్తున్న శ్రీవారి దర్శన టికెట్లతో ఏపీ టూరిజం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, ఐఆర్‌టీసీల ద్వారా చాలామంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేవారు. ఈ టికెట్లు వల్ల సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేవారు. కానీ, ఇప్పడు టీటీడీ నూతన పాలకమండలి ఈ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
రోజుకు 4వేల టిక్కెట్లు...
టీటీడీ ఇతర రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు రోజుకు నాలుగువేల టికెట్లు కేటాయిస్తుండేది. అందులో ఏపీ టూరిజానికి 1,000 టిక్కెట్లు కాగా, తెలంగాణకు 800 టికెట్లు, మిగతా వాటికి 500, 400 చొప్పున టికెట్లను కేటాయించేది. ఈ టిక్కెట్ల కోసం ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల స్లాట్ ద్వారా దర్శనం కల్పించేది. అయితే టూరిజం కార్పొరేషన్ల టికెట్ల అవకతవకలపై ఫిర్యాదులు రావడంతో ఏడు టూరిజం కార్పొరేషన్లకు దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సమస్యలు తప్పవని చాలామంది భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications