వింత: అసెంబ్లీలో ఉన్న పార్టీలకు మంత్రిపదవులు,తప్పనిపరిస్థితేనా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగుతున్నారు.వైసీపీ సభ్యులు టిడిపిలో చేరినా సాంకేతికంగా అసెంబ్లీలో వైసీపి సభ్యులుగానే ఉన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగుతున్నారు.వైసీపీ సభ్యులు టిడిపిలో చేరినా సాంకేతికంగా అసెంబ్లీలో వైసీపి సభ్యులుగానే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ టిడిపిలో అసంతృప్తికి కారణమైంది.మంత్రి పదవి దక్కలేదనే కారణంగా పార్టీ నాయకులు కొందరు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ అధినేతపై అసంతృప్తిని వ్యక్తం చేసిన నాయకులపై బాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గాన్ని కూర్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని బాబు టెలికాన్ఫరెన్స్ లో పార్టీ నాయకులకు వివరించారు.
అయితే ఏదైనా ఉంటే నేరుగా తనకు చెప్పాలని కాని బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన పార్టీ నాయకులకు హితవు పలికారు.అయితే 2019 ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబునాయుడు మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

అసెంబ్లీలో ఉన్న పార్టీలకు మంత్రి పదవులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు పార్టీలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. టిడిపి, వైసీపీ, బిజెపి.2014 ఎన్నికల్లో బిజెపి, టిడిపిలు మిత్రపక్షాలుగా పోటీచేశాయి.
ఈ కూటమికి అసెంబ్లీలో 106 అసెంబ్లీ స్థానాలున్నాయి.బిజెపి సభ్యులు ఈ అసెంబ్లీలో 4 స్థానాలు కలిగి ఉన్నారు.టిడిపికి102 మంది ఎమ్మెల్యేలున్నారు.వైసీపీకి 69 సభ్యులున్నారు.అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 21 మంది వైసీపి ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టిడిపిలో చేరారు.అయితే అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

బిజెపికి రెండు మంత్రి పదవులు
అసెంబ్లీలో బిజెపికి నలుగురు సభ్యులున్నారు.అయితే ఆ పార్టీకి చెందిన ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించారు చంద్రబాబునాయుడు. మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావుకు మంత్రిపదవులు దక్కాయి.అయితే వైసీపీ నుండి 21 మంది టిడిపిలో చేరారు.అయితే వారు సాంకేతికంగా టిడిపి సభ్యులు కారు. సాంకేతికంగా వారు వైసీపీ సభ్యులుగానే కొనసాగుతారు.దీంతో అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉన్న పార్టీలకు మంత్రివర్గంలో చోటు దక్కినట్టైంది.

మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి
అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకొంటారు.అయితే ఏ పార్టీకి చెందిన వారిని తీసుకోవాలనే అడ్డంకులు రాజ్యాంగ పరంగా లేవు.అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలనే మంత్రులుగా తీసుకొంటారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకొంటే రాజకీయంగా ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి ఇబ్బందులు ఉంటాయి. ఈ కారణాలచేత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలనే మంత్రులుగా తీసుకొంటారు.

సంకీర్ణ ప్రభుత్వాల్లో ఇతర పార్టీల ఎమ్మేల్యేలకు పదవులు
సంకీర్ణ ప్రభుత్వాల్లో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇస్తుంటారు.అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మద్దతులేని సమయంలో మద్దతిచ్చిన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం చూస్తూంటాం.
కాని సంకీర్ణ ప్రభుత్వాల తరహ కాకుండా ఇతర పార్టీలకు చెందిన వారికి మంత్రి పదవులను కట్టబెట్టిన ఘటనలు చూశాం. ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవలే ఈ తరహ ఉదంతాలను చూశాం.

అనేక ఘటనలు
కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తొలుత శివసేన నుండి విజయం సాధించారు.అయితే ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొన్నారు.ఆయన శివసేనకు రాజీనామా చేసి తర్వాత బిజెపిలో చేరారు.మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో టిడిపి నుండి విజయం సాధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను టిఆర్ఎస్ ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకొంది.తలసానిని మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల టిడిపి నాయకులు గవర్నర్ ను తీరును తప్పుబట్టారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ అదే తీరును అవలంభించింది ఆ పార్టీ.












Click it and Unblock the Notifications