సభా సమరం, చంద్రబాబు అరెస్ట్ పై చర్చ - స్పీకర్ తాజా ఆదేశాలు..!!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు, మండలి సమావేశాలు 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం కానుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏ అంశాలపై చర్చించాలనే దానిపై ఈ సమావేశంలో అజెండా ఖరారు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించనుంది.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఏపీ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో పలు బిల్లులను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సభా వేదికగా వివరించాలని భావిస్తోంది. ఇదే సమయంలో కేంద్రం తీసుకొచ్చిన మహిళా బిల్లు..రాష్ట్రంలో అమలు చేస్తున్న మహిళా సాధికారత గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ పైన నిలదీసేందుకు టీడీపీ సిద్దమవుతోంది. ఈ సమావేశాల్లో 12కి పైగా బిల్లులను ప్రభుత్వం ఆమోదం తీసుకోవాలని భావిస్తోంది.

అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు..బిల్లుల గురించి ముఖ్యమంత్రి జగన్ పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. దాదాపు అజెండాగా 25 అంశాలను ఎంపిక చేసారు. తొలి రోజు ప్రశ్నోత్తరాల తరువాత జరిగే బీఏసీలో అజెండాను అధికారికంగా ఖరారు చేయనున్నారు. సభలో టీడీపీ చంద్రబాబు అరెస్ట్ పై నిలదీసే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. టీడీపీ డిమాండ్ చేస్తే చంద్రబాబు కేసుతో పాటుగా స్కిల్ స్కాంలో ఏం జరిగిందీ..చంద్రబాబు పాత్ర పైన వివరించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందని సమాచారం. ఇదే సమయంలో సమావేశాల్లో తొలి రోజునే పలు ఆర్దినెన్స్ లను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ నివేదికలను సభకు సమర్పించనున్నారు.
ఇటు టీడీఎల్పీ సభా వేదికగానే చంద్రబాబు అరెస్ట్ పైన గళమెత్తాలని నిర్ణయించింది. అదే విధంగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తామని టీడీపీ వెల్లడించింది. సభా సంప్రదాయాల ప్రకారం ఏ అంశం పైన చర్చకు వచ్చినా ప్రభుత్వం సిద్దమని ఇప్పటికే అధికార పార్టీ నేతలు స్పష్టం చేసారు. ఈ సారి సమావేశాలకు ఉన్న ప్రాధాన్యతతో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ, మండలి సమావేశాల నేపథ్యంలో బుధవారం శాసనసభ కమిటీ హాల్‌లో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నతాధికారులతో సమావేశమై బందోబస్తు, ఇతర ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు. పటిష్టమైన పోలీస్, మార్షల్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications