'అన్నదాత సుఖీభవ' విడుదల వేళ ఆ రైతుల్లో కొత్త టెన్షన్ - ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!
ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సిద్దమైంది. పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటికే అర్హత ఉన్న రైతుల జాబితా ఖరారు చేసింది. పీఎం కిసాన్ పథకం కింద రూ 2 వేలు.. అన్నదాత సుఖీభవ పథకం గా రూ 5 వేలు కలిపి రూ 7 వేలు రైతుల ఖాతాల్లో జమ కానుంది. అయితే, ఇదే సమయంలో ఆధార్ సీడింగ్ జరగని రైతుల లక్షల్లో ఉండటం కొత్త సమస్యగా మారింది. దీంతో.. ప్రభుత్వం అధికార యంత్రాంగానికి తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది.
రేపు నిధుల జమ
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో రేపు (శనివారం) నిధులు జమ కానున్నాయి. పీఎం కిసాన్ తో పాటుగా ఈ నిధులు అందనున్నాయి. సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తం గా 46,85,838 రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయని చెప్పారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కేంద్ర వాటాతో కలిపి మొత్తం రూ.7వేలు అందిస్తున్నారు. ఏడాదికి కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయంతో కలిపి, రాష్ట్రప్రభుత్వం మరో రూ.14 వేలు ఇవ్వనుంది. మొదటి, రెండో విడతల్లో రూ.ఐదేసి వేలు చొప్పున, మూడో విడత రూ.4వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

ఆధార్ సీడింగ్
రేపు విడదల కానున్న తొలివిడతలో కేంద్రం రూ.2వేలు చొప్పున రూ.831.51కోట్లు విడుదల చేయనుంది. దీంతో ఆగస్టు 2న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో రైతుకు రూ.7వేలు జమ చేస్తాయి. మరోవైపు 'అన్నదాత సుభీభవ'కు సంబంధించి 59,750 గ్రీవెన్సులు నమోదు కాగా... 58,464 దరఖాస్తులను పరిష్కరించారు. ఈ పథకంపై సందేహాల నివృత్తి కోసం 155251 టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో ఉంచారు. కాగా, ఇదే సమయంలో అధార్ సీడింగ్ లేని రైతులు లక్షల్లో ఉన్నట్లు గుర్తించారు. అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధించిన రైతుల్లో లక్షల మంది ఆధార్ కార్డుల్లోని వివరాలు వెబ్ ల్యాండ్ లోని వివరాలతో అను సంధానం చేయలేదు. రైతుల పేర్లు, ఇంటి పేర్లు తప్పుగా నమోదు కావటం.. చనిపోయిన వారి స్థానంలో వారసుల పేర్లు నమోదు కాకపోవటం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రభుత్వ ఆదేశాలు
రైతుల వివరాల్లో దొర్లిన తప్పులను సరి దిద్దినందున తహసీల్దార్ల లాగిన్ లో వివరాలు వేలల్లో పెండింగ్ లో ఉన్నాయి. దీంతో, అర్హుల జాబితాలో తమ పేర్లు కనిపించక రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేసింది. అందుబాటు లో ఉన్న రికార్డుల్లోని వివరాల ఆధారంగా అర్హులు నష్టపోకుండా చూడాలని కోరింది. ఆధార్ కార్డు ల్లోని వివరాల్లో మార్పులు, చేర్పుల పై రైతులతో వీఆర్ఓ ల సాయంతో దరఖాస్తు చేయించాలని సూచించింది. దీని ద్వారా ఆధార్ సీడింగ్ చేయని రైతులకు లబ్ది కలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications