పసుపు పండుగకు సర్వం సిద్దం: మహానాడులో నేటి షెడ్యూల్ ఇదే!..
మహానాడు కార్యక్రమంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ లకు సంబంధించి మొత్తం 33తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినవి 21, తెలంగాణకు సంబంధించినవి 9 ఉన్నట్లుగా సమాచారం.
అమరావతి: పసుపు పండుగ వచ్చిదంటే తెలుగుదేశం శ్రేణులకు ఎక్కడ లేని ఉత్సాహం. అంతా ఒక్క వేదిక పైకి వచ్చి తమ బలాన్ని చాటి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఏటా నిర్వహించే పసుపు పండుగల్లాగే ఈ సంవత్సరం కూడా మహానాడుకు సర్వం సిద్దమైంది. ఉక్కు నగరం విశాఖ వేదికగా నేటి నుంచి ప్రారంభం కానున్న మహానాడు మూడురోజుల పాటు కొనసాగనుంది.
మహానాడు కోసం విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. వేదికకు ఎన్టీఆర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. మహానాడు కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశముంది. తెలంగాణ నుంచి ఏకంగా రెండు ప్రత్యేక రైళ్లలో కార్యకర్తలు తరలిరానున్నారు.

మహానాడు తీర్మానాలు:
మహానాడు కార్యక్రమంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ లకు సంబంధించి మొత్తం 33తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినవి 21, తెలంగాణకు సంబంధించినవి 9 ఉన్నట్లుగా సమాచారం. మరో మూడు ఉమ్మడి తీర్మానాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సంక్షేమ కార్యక్రమాలపై చర్చ:
మహానాడులో చంద్రబాబు సర్కార్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంక్షేమ లెక్కలన్నింటిని ప్రజలకు తెలియపరిచేలా.. ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమం గురించి వివరించే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వ చిత్తశుద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు.
సంక్షేమ కార్యక్రమాలతో పాటు పోలవరం కోసం ప్రభుత్వం శ్రమిస్తున్న తీరు.. రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో సాగునీటి ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రణాళికలు, వ్యవసాయ రంగం కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించనున్నారు.

12వ సారి అధ్యక్షునిగా చంద్రబాబు:
ఈ దఫా మహానాడు ద్వారా చంద్రబాబు మరోసారి టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. 12వ సారి ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవుతుండటం విశేషం. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవడం మాత్రం ఇది రెండోసారి. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో మహానాడుకు వచ్చే జనం కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ ఏర్పాటు చేసిన వాహనాల ద్వారానే శ్రేణులను వేదిక వద్దకు తరలించనున్నారు.

ఇదీ ఈరోజు మహానాడు షెడ్యూల్:
*తొలుత టీడీపీ ప్రతినిధుల నమోదుతో మహానాడు అధికారికంగా ప్రారంభమవుతుంది. ఉదయం 10గం.కు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు.
*పార్టీ పతాకావిష్కరణ.. మా తెలుగు తల్లి గేయాలపన, ఆపై జ్యోతి ప్రజ్వలనతో మహానాడు సమావేశాలు మొదలవుతాయి.
*సమావేశాల్లో భాగంగా తొలుత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు. అనంతరం ఇటీవలి కాలంలో మరణించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు సంతాపం ప్రకటిస్తారు.
*ప్రధాన కార్యదర్శి నివేదిక, జమా ఖర్చుల నివేదిక, నియమావళి సవరణలను ప్రవేశపెడుతారు. అటు తర్వాత చంద్రబాబు ప్రారంభోపన్యాసం ఉంటుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.












Click it and Unblock the Notifications