లోకేష్ హాయ్‌ల్యాండ్ కొన్నాడా, లింగమనేని భూమి నేనే తీసుకోలేదు: బాబు
హైదరాబాద్/విజయవాడ: హాయ్‌ల్యాండ్ కొన్నాడని తన తనయుడు నారా లోకేష్ పైన వైసిపి నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, అలాగే తాను ఇప్పుడు ప్రభుత్వానికి చెందిన ఇంటిలో ఉంటున్నానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు చెప్పారు.
రాజధాని భూముల విషయంలో వైసిపి నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజధానిలో అన్నీ లావాదేవీలు పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. వీరి ఆరోపణలతో రైతుల్లో ఆందోళన కలిగించే ప్రయత్నమన్నారు. ఇది నీచమైన పని కాదా అని మండిపడ్డారు.
దూళిపాళ్ల నరేంద్ర గ్రామం రాజధానికి దగ్గరలోనే ఉందని, అందుకే ఆయన భూములు కొన్నాడని చెప్పారు. పయ్యావుల కేశవ్ కూడా కొన్నానని చెప్పారన్నారు. మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు తదితరులు తాము కొనలేదని, కొన్నట్లు నిరూపిస్తే రాసిస్తామని సవాల్ చేశారని గుర్తు చేశారు.
సుజనా చౌదరి, మురళీ మోహన్‌లు ఎన్నికలకు ముందే కొన్నట్లు చెప్పారన్నారు. తన కొడుకు హాయ్ ల్యాండులో కొన్నట్లు అనవసర ఆరోపణలు చేశారన్నారు. ఇలాంటి ఆరోపణలు దేనికి సంకేతమన్నారు. రైతులు తమను నమ్మి భూములు ఇచ్చారని చెప్పారు.
భూమి తీసుకోమని లింగమనేని అడిగారు.. నేనే వద్దన్నా
ల్యాండ్ పూలింగులో లింగమనేని రమేష్ భూమి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారని... కానీ లింగమనేని వచ్చి తన భూమిని పూలింగులో తీసుకోవాలని అడిగాడని, కానీ నేనే వద్దని చెప్పానని తెలిపారు. రాజధానికి 34వేల ఎకరాలు చాలని, వారిది కూడా తీసుకుంటే ఎక్కువ అవుతుంది ఊరుకున్నామని చెప్పారు.
వీరి భూమి తీసుకుంటే రైతులు ఇచ్చిన భూమి ధర తగ్గుతుందని, రైతుల ప్రయోజనాల కోసమే తాము లింగమనేని వంటి వారి భూములు తీసుకులేదన్నారు. కేవలం లింగమనేని రమేష్ మాత్రమే కాదని.. పెద్దపరిమి, హరిశ్చంద్రాపురం గ్రామాల ప్రజలు కూడా భూమి తీసుకొమని చెప్పారన్నారు. కానీ మేం తీసుకోలేదన్నారు.
లింగమనేని కొన్న భూములకు హైకోర్టు క్లియరెన్స్ కూడా ఇచ్చిందని చెప్పారు. తాను ప్రతి ఏడాది తన ఆస్తులను ప్రకటిస్తున్నానని చెప్పారు. తాను ప్రకటించిన ఆస్తుల కంటే రూపాయి ఎక్కువ ఉన్నా వారికి రాసిస్తానని చాలాసార్లు చెప్పానని గుర్తు చేశారు.
రైతులు రాజకీయాలకు లొంగకుండా భూమి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. వేలాదిమంది రైతులు ల్యాండ్ పూలింగ్‌కు సహకరించారని చెప్పారు. రైతులు భూములు ఇచ్చే సమయంలో కొందరు కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారన్నారు. రైతులు 34వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చారన్నారు.
రాజధానిలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. తప్పుడు రాతలు, తప్పుడు ఆరోపణల పైన ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. దీనిని చాలా సీరియస్‌గా తీసుకుంటామన్నారు. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి అందరు సహకరించాలన్నారు.
రాజధాని అలైన్మెంటులో ఊళ్లు పోకుండా చూశామన్నారు. అందుకే 3600 ఇళ్లు పోయే బదులు.. అలైన్మెంట్ పక్కకు మార్చడంతో నాలుగువందల ఇళ్లు మాత్రమే ఇప్పుడు పోతున్నాయన్నారు. రాజధానిలో భూదందా అంటూ తప్పుడు ప్రచారం సరికాదన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేశామన్నారు.

చంద్రబాబు
రైతులు రాజకీయాలకు లొంగకుండా సహకరించారని చంద్రబాబు ప్రశంసించారు. తాము ఒక పద్ధతి ప్రకారం రాజధాని నిర్మాణంపై ముందుకు పోతున్నామని చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు ఇతర దేశాల వారు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. అందరికీ ఆమోదయోగ్య రాజధాని కావాలన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా అమరావతిని ఎంచుకున్నామని చెప్పారు.

జగన్
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టిడిపి నేతలు భూదందా చేశారని... శనివారం అసెంబ్లీకి ప్లకార్డులు పట్టుకొని వచ్చిన వైసిపి ఎమ్మెల్యేలు, వైసిపి అధినేత జగన్.

జగన్
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టిడిపి నేతలు భూదందా చేశారని... శనివారం ర్యాలీగా రవీంద్ర భారతి నుంచి అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న జగన్.

జగన్
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టిడిపి నేతలు భూదందా చేశారని... శనివారం అసెంబ్లీకి ప్లకార్డులు పట్టుకొని వచ్చిన వైసిపి ఎమ్మెల్యేలు, వైసిపి అధినేత జగన్.
సాక్షి పిచ్చి రాతలు
ప్రజల సొమ్మును దోచుకున్న జగన్ పెట్టిన పత్రిక సాక్షిలో గత నాలుగైదు రోజులుగా పిచ్చి రాతలు రాస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో జరిగిన భూలావాదేవీల వివరాలను ఆయన మీడియా ముందు ఉంచుతూ.. రాజధాని ప్రాంతం కావడంతో సొంతిల్లు ఉండాలని, కొంత భూమిని కొనాలని ఎవరు మాత్రం భావించరన్నారు.
ఇటీవలి కాలంలో రాజధాని ప్రాంతంలో 20,306 లావాదేవీలు జరిగాయని, మొత్తం 9,231 ఎకరాలు చేతులు మారాయన్నారు. వీటిల్లో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయన్నారు. ఇళ్ల స్థలాల కోసం 7,942 మంది 418 ఎకరాలు కొనుగోలు చేశారన్నారు.
ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టాప్ -100 లావాదేవీలను పరిశీలిస్తే అత్యధికంగా 7.5 ఎకరాలు చేతులు మారిందని, 100వ లావాదేవీ 2.70 ఎకరాలని, ఈ 100 లావాదేవీల్లో భాగంగా 365.662 ఎకరాలు చేతులు మారాయన్నారు. ఇదేమైనా నేరమా? అని ప్రశ్నించారు.
రైతులు అమ్ముకున్న భూమి 1,724 ఎకరాలని వెల్లడించిన చంద్రబాబు.. జగన్ పత్రిక ఓ పద్ధతి ప్రకారం బురదజల్లుతోందన్నారు. రాజధాని ప్రాంతం ఎక్కడన్న విషయం వెల్లడికాకముందు దొనకొండ, నూజివీడు, తిరుపతి, నందిగామ వంటి ప్రాంతాల్లోనూ భూలావాదేవీలు జరిగాయన్నారు.
వైసిపి నేత అవినాష్ రెడ్డి మామ దొనకొండలో బలవంతంగా భూములు ఆక్రమించాడన్న కేసు నమోదైందని, అక్కడ జరిగిన ఓ హత్య కేసులో ఆయన పేరుందన్నారు. ఈ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన వారు నష్టపోయారన్నారు.
లోకేష్ 425 కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్ భూమిని కొన్నాడని ఆరోపించడం అత్యంత దుర్మార్గమైన్నారు. జప్తులో ఉన్న భూములు ఎలా కొంటారన్న విషయం కూడా సాక్షికి తెలీకపోవడం దురదృష్టకరమన్నారు. గుడ్డ కాల్చి ముఖాన వేసి తుడుచుకోమని అనడం భావ్యమా? సాక్షినే కాదు... వార్తలు రాసిన, చూపిన మీడియాను అడుగుతున్నా... తప్పుడు ఆరోపణలు చేస్తూ, పబ్బం గడుపుకోవాలని అనుకోవడం తుచ్ఛం అన్నారు.
వైయస్ హయాంలో ఇడుపులపాయలో 610 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, అప్పుడు ప్రతిపక్షం ఉద్యమిస్తే విధిలేని పరిస్థితుల్లో భూమిని అప్పగించారని, తిరిగి ఇచ్చామని చెబుతున్న భూములను ఇంకా అనుభవిస్తున్నారని, శిక్ష నుంచి తప్పించుకోవడానికి చట్టాన్నే మార్చారని జగన్ పైన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications