ఆశా కార్యకర్తలకు కూటమి సర్కారు తీపి కబురు..
ఏపీలోని ఆశా కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న వీరికి.. ప్రభుత్వ ఉద్యోగుల లానే పలు వెసులుబాట్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రాట్యుటీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల మంజూరుకు ఆమోదం తెలిపింది. అలానే ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్టు అధికారులు స్పష్టం చేశారు.
30 ఏళ్లపాటు పనిచేసిన ఆశాలకు గ్రాట్యుటీ కింద రూ.1.50 లక్షల వరకు చెల్లించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. ఆశాలకు గ్రాట్యుటీ విధానం ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేకపోయినా ఏపీలో అమలు చేయనున్నారు. ప్రసూతి సెలవుల కింద తొలి కాన్పు సమయంలో 3 నెలలు, రెండో కాన్పు సమయంలో మరో 3 నెలల చొప్పున అధికారికంగా సెలవులు మంజూరు చేయనున్నారు. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం పట్ల కూడా ఆశాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది.. పట్టణ ప్రాంతాల్లో 5,735 మంది ఆశా వర్కర్లు సేవలందిస్తున్నారు. ఈ హామీల అమలుతో రాష్ట్రంలో ఉన్న 42,752 మంది ఆశా కార్యకర్తలకు ప్రయోజనాలు చేకూరనున్నాయి. అందుకోసం ప్రభుత్వం ఏటా రూ.420 కోట్ల వరకు ఖర్చు చేయనుంది.
ఇక గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశా కార్యకర్తల కోసం సీఎం చంద్రబాబు సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. విధుల నిర్వహణలో అవసరమైన వారికి స్మార్ట్‌ఫోన్లు అందజేశారు. అర్హతలు ఉన్న వారికి ఏఎన్‌ఎం నియామకాల్లో ప్రాధాన్యం ఇచ్చారు. రేషన్ కార్డులు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కింద ఉచిత వైద్య సదుపాయాలు మంజూరు చేశారు. వృద్ధాప్య పింఛనుకు కూడా అర్హత కల్పించి.. నెలకు వేతనాన్ని రూ.10 వేలకు పెంచారు.












Click it and Unblock the Notifications