అల్లు అర్జున్ నంద్యాల ఎఫెక్ట్ గట్టిగానే పడిందిగా..!
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో పర్యటించిన సంగతి అందరికి తెలిసిందే. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అల్లు అర్జున్ ఈ నెల 11న తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు.నంద్యాల వెళ్లి మరీ ఆయనకు అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు శిల్పా రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో శిల్పా రవిచంద్ర నివాస ప్రాంతం కిక్కిరిసిపోయింది.
ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా భారీ ఎత్తున జనం గుమికూడడంపై ఈసీ సీరియస్‌గా స్పందించింది.ముందస్తు అనుమతి లేదన్న కారణంగా అల్లు అర్జున్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసులు నమోదయ్యాయి. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన తాజాగా పోలీసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారనే కారణంతో నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై ఛార్జెస్ ఫైల్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది. అలాగే శాఖాపరమైన విచారణ జరిపించాలని డీజీపీని.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఎస్పీతో పాటుగా ఎస్డీపీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అంతమంది జనసమీకరణ చేయడంపై ఈసీ సీరియస్ అయ్యింది.భారీ జనసమీకరణ జరుగుతోందని సమాచారం అందించలేదనే కారణంతో ఇద్దరు కానిస్టేబుల్స్ పై చర్యలకు ఆదేశించింది. ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజులను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఈమేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications