మాట్లాడనివ్వరా?: జగన్, నేర్చుకోమన్న చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన బీసీ తీర్మానంపై ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీసీలకు 33.33శాతం రిజర్వేషన్లు కల్పించాలనే తీర్మానంపై మాట్లాడే అవకాశం తమకు ఇవ్వకపోవడం దారుణమని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాను చేతులు పైకెత్తినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికార పక్షం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని అన్నారు. ఎజెండాలో బీసీ తీర్మానం ఎక్కడ పెట్టారని ప్రశ్నించారు.
సిఎం చంద్రబాబు హఠాత్తుగా వచ్చి ప్రకటించారని అన్నారు. రాజకీయాల్లో ఇంత దారుణం చూడలేదని చెప్పారు. ప్రతిపక్ష నేత మాట్లాడాలంటే రాసివ్వాల్సిన అవసరం లేదని అన్నారు. తాను మాట్లాడతానంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటన, తీర్మానం మధ్య తేడా తెలుసుకోవాలని అన్నారు. కౌరవ సభను తలపిస్తున్నారని ఆరోపించారు. తీర్మానంపై చర్చ జరగాలని అన్నారు. తాను బీసీలకు సంబంధించిన తీర్మానాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

రాక్షసత్వం మీదే: యనమల
జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ముందు రూల్స్ తెలుసుకోవాలని అన్నారు. రూల్స్ తెలియకుండా తీర్మానాన్ని వైండప్ చేస్తామనడం సరికాదన్నారు. సభలో రాష్ గానే మాట్లాడతామనడం మంచిది కాదని అన్నారు. మీ రాక్షసత్వ లక్షణాలను అందరికీ అంటగట్టొద్దని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. జగన్ అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. తీర్మానం విషయంపై స్పీకర్ అనుమతి తీసుకునే ప్రకటించామని తెలిపారు.
కాగా, వైసిపి చెప్పిన వ్యక్తులతోనే మాట్లాడించానని స్పీకర్ అన్నారు. శనివారం ఉదయమే బీసీ తీర్మానంపై సమాచారం ఇవ్వాలని సెక్రటరికీ చెప్పినట్లు తెలిపారు. ఇప్పుడు మాట్లాడండని జగన్మోహన్ రెడ్డికి సూచించారు. తాను సూచిస్తున్నా.. స్పీకర్ సూచిస్తున్నా మాట్లాడటం లేదని జగన్‌పై అన్నారు. మంత్రి యనమల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సభను గౌరవించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతపై ఉందని యనమల అన్నారు. తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో వైయస్ జగన్ సభలో లేరని చెప్పారు.
ముందు నేర్చుకో: చంద్రబాబు
ప్రతిపక్ష నేత జగన్ రూల్స్ చదువుకుంటే అన్ని తెలుస్తాయని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తాను ఏడో సారి ఎమ్మెల్యేనని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ఏ సమయంలోనైనా ప్రభుత్వం ప్రకటించవచ్చని అన్నారు. కొత్త ఎమ్మెల్యేలు నేర్చుకోవాలే తప్ప దౌర్జన్యం చేస్తామంటే కుదరదని అన్నారు. చదువుకున్న మూర్ఖుల్లా వ్యవహరిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఇది ఇలా ఉండగా ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ మూజూవాణి ఓటుతో ఆమోదించింది. అనంతరం అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications