
వైసీపీ ప్లీనరీకి వాలంటీర్ల తరలింపులు-ఎంపీడీవో వాయిస్ మెసేజ్ లీక్- సోషల్ మీడియాలో వైరల్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్ధపై ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి. అటు ప్రభుత్వానికి, ఇటు వైసీపీకి కూడా ఉపయోగపడేందుకే వాలంటీర్ల వ్యవస్ధ ఏర్పాటు చేసినట్లు అధికార పార్టీ నేతలు చెప్పుకుని తిరుగుతున్నారు. అటు విపక్షాలు కూడా వాలంటీర్లపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ దశలో అమలాపురంలో వైసీపీ ఏర్పాటు చేసిన ప్లీనరీకి వాలంటీర్ల తరలింపు వివాదాస్పదమైంది.
అమలాపురం వైసీపీ ప్లీనరీకి వాలంటీర్లను పంపాలంటూ స్ధానిక ఎంపీడీవో ఇచ్చిన ఆదేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ఆయన వాలంటీర్లను తరలించాలంటూ గ్రామ కార్యదర్శులకు ఇచ్చిన ఆదేశాల ఆడియో లీక్ అయింది. ఇది కాస్తా సోషల్ మీడియాకు చేరడంతో రాష్ట్రవ్యాప్తంగా సర్కులేట్ అవుతోంది. ఇందులో మంత్రి విశ్వరూప్ ఇందుపల్లి ఫంక్షన్ హాల్లో జరుగుతున్న వైసీపీ ప్లీనరీకి వాలంటీర్లను తరలించాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకే ఎంపీడీవో వాలంటీర్ల తరలింపుకు మెసేజ్ పెట్టినట్లు అర్ధమవుతోంది.

ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న పలు ఎన్నికలు, ఉపఎన్నికల్లో వాలంటీర్లు అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందుకుంటున్న వాలంటీర్లు ఎన్నికలతో పాటు అన్ని విషయాల్లోనూ అధికార పార్టీకి సహకరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికతో పాటు అన్ని వ్యవహారాల్లోనూ వాలంటీర్ల జోక్యం పెరుగుతోంది. ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యక్రమాలకు వారిని తరలించాలంటూ ఎంపీడీవో ఇచ్చిన మెసేజ్ బయటపడటంతో విమర్శలు వస్తున్నాయి.