అమరావతి పై హైకోర్టులో తాజా వ్యాజ్యం - మరో పాదయాత్ర, సభ..!!
హైకోర్టులో రాజధాని ప్రాంత రైతు సంఘాలు మరో వ్యాజ్యం దాఖలు చేసాయి. అమరావతిలో జగనన్న ఇళ్ల ప్రక్రియను ఆపాలని కోరాయి. ఇళ్ల స్థలాలకు భూ బదలాయింపు చట్ట విరుద్దమని ప్రకటించాలని అభ్యర్ధిస్తూ పిటీషన్ దాఖలు చేసాయి. ఇదే సమయంలో ఆర్ -5 జోన్ పై మరో ఉద్యమం చేస్తామని ఏపీ పరిరక్షణ సమితి ప్రకటించింది. జూలై 17 నుంచి తొలి దశ ఉద్యమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం అక్కడ ఇళ్ల నిర్మాణం ప్రారంభం దిశగా ఏర్పాట్లు చేస్తోంది.
హైకోర్టులో మరో పిటీషన్:రాజధాని అమరావతికి భూ సమీకరణ కింద ఇచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్ -5 జోన్ ఏర్పాట్లు..భూ బదలాయింపు..సెంటు పట్టాల మంజూరును సవాల్ చేస్తూ హైకర్టులో పిటీషన్ దాఖలైంది.భూ సమీకరణ భూముల్లో పేదలందరికీ ఇళ్లు పథకాన్ని అమలు చేయటం ఏపీసీఆర్డీఏ నిబంధనలను ఉల్లంఘించటమేనని..

ప్రభుత్వం జారీ చేసిన రెండో జీవోలు నిబంధనలకు విరుద్దమని వ్యాజ్యంలో పేర్కొన్నారు. రాజధాని ప్రాంత రైతు సంఘాలు ఈ వ్యాజ్యం దాఖలు చేసాయి. రాజధాని ఇళ్ల స్థలాల కేటాయింపు హైకోర్టు త్రిసభ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు విరుద్దమని పిటీషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఆర్ -5 జోన్ లో 21 లే అవుట్లకు సీఆర్డీఏ అమోదం తెలపటం ఏపీ ఏపీ బిల్డింగ్ నిబంధనలు -2017కి విరుద్దమని వివరించారు.
నిబంధనల ఉల్లంఘనగా:ఇళ్ల స్థలాల పేరుతో ఒక్క సెంటు భూమి కేటాయింపుల కోసం ఆర్ 5 జోన్ ఏర్పాటు కోసం రాజధాని ప్రణాళికలో మార్పులు చేయటం వెనుక దురుద్దేశం ఉందని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా జగనన్న ఇళ్ల పేరుతో జరుగుతున్న పనులను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వ్యాజ్యంలో ప్రతివాదులుగా సీఎం జగన్.. పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిని వ్యక్తిగత హోదాలో పేర్కొన్నారు. వారితో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. హౌసింగ్ మంత్రిత్వ శాఖను ప్రతివాదులుగా చేర్చారు. అటు జూలై 8న ఇంటి నిర్మాణాల శంకుస్థాపకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
పాదయాత్ర..బహిరంగ సభ:మరో వైపు ఆర్ -5 జోన్ పైన ఉద్యమం చేస్తామని ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రకటించారు. ఉద్యమం మొదటి దశలొ బాగంగా జూలై 17 నుంచి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ నుంచి అమరావతిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన స్థలం వరకు పాదయాత్ర..
బహిరంగ సభకు నిర్ణయించారు. రెండో దశలో తాడికొండ, మంగళగిరి తో పాటుగా రాజధాని పరిసర ప్రాంత నియోజకవర్గాల్లో గడప గడపకు అమరావతి నిర్వహిస్తామని ప్రకటించారు. మూడో దశలో జగన్ ఓటమే లక్ష్యంగా 175 నియోజకవర్గాల్లో అమరావతి రథయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని పేదలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దం అవ్వటం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications