ఏకైక రాజధాని అమరావతి: అప్పుల కుప్ప చేస్తున్నారంటూ జయప్రకాశ్ నారాయణ ఆవేదన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆదివారం విజయవాడలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జయప్రకాశ్ నారాయణ మాట్లాడారు. రాజధానిపై ఏపీ ప్రభుత్వం తికమక చేసిందన్నారు.

కన్నీళ్లే మిగులుతాయంటూ జేపీ
ఏపీ రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని జయప్రకాశ్ నారాయణ అన్నారు. రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, ఇప్పటికైనా హైకోర్టు తీ ర్పును ప్రభుత్వం గౌరవించి అమలు చేయాలని సూచించారు. తుగ్లకు కూడా రాజధానులు మార్చాడని చురకలంటించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి విజ్ఞత ప్రదర్శిస్తే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, లేదంటే ఆర్థిక అభివృద్ధిలో వెనుకబడి కన్నీళ్లు కారుస్తూనే ఉండిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అమరావతిని అందరూ అంగీకరించారన్న జేపీ
అందరూ కలిసి గతంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించారని.. రైతులకు, ప్రజలకు, ప్రభుత్వానికి అభివృద్ధి ఫలాలు అందేలా గతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరించారని జయప్రకాశ్ తెలిపారు. ఏపీలో ప్రస్తుతం పాలన గాడి తప్పిందని, మారాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగిపోయాయని జేపీ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పు చేసి పప్పు కూడు సరైన పద్ధతి కాదన్నారు.

ఏపీ.. శ్రీలంకలా మారే పరిస్థితి అంటూ జేపీ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిన పణంగా పెట్టి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేయవద్దని ఏపీ సర్కారుకు సూచించారు. ముందుచూపు లేకుండా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు వ్యవహరించడం సరికాదన్నారు. ఎడాపెడా అప్పులు చేస్తే శ్రీలంకలా మారిపోతుందని హెచ్చరించారు. పేదలకు సంక్షేమం అవసరమే కానీ, అదొక్కటే సరిపోదన్నారు. ఏపీ సర్కారు అభివృద్ధిని విస్మరించడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వ పాఠశాల ప్రవేశాలు పెరుగుతున్నాయని చెప్పడం అబద్ధమేనని అన్నారు. కాగా, అమరావతితోపాటు విశాఖపట్నం, కర్నూలును రాజధానులుగా చేస్తామని ఏపీ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేనతోపాటు ఇతర పార్టీలు కూడా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాయి.












Click it and Unblock the Notifications