అమరావతి రైతులకు రిటర్న్ గిఫ్ట్..! ఐదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్..!
ఏపీలో అమరావతి రాజధాని రైతులకు కూటమి సర్కార్ రాక తర్వాత వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. అంతకు ముందు ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో కకావికలమైన వీరంతా.. ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులకు పలు విషయాల్లో ఊరట దక్కుతోంది. ఇదే క్రమంలో బ్యాంకులు కూడా రైతులకు సహకరించేందుకు ముందుకొస్తున్నాయి.
అమరావతి రాజధాని కోసం అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అడగ్గానే భూములిచ్చిన రైతులకు సర్కార్ కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లు వారికి ఏ విధంగానూ పనికి రాకుండా పోయాయి. దీనికి కారణం గత వైసీపీ ప్రభుత్వం రాజధానిపై తీసుకున్న నిర్ణయాలతో ఈ ప్లాట్లకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లపై రుణాలు ఇచ్చినా తిరిగి రావన్న ఉద్దేశంతో అప్పట్లో బ్యాంకులు ఆ నిర్ణయం తీసుకున్నాయి.

కానీ ఇప్పుడు పరిస్ధితులు పూర్తిగా మారిపోవడంతో అమరావతి రైతులకు ప్రభుత్వం కేటాయిస్తున్న రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వాలని ఇతర బ్యాంకులకు లీడ్ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయా బ్యాంకులు రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకప్పుడు అమరావతికి తమ భూములు ఇచ్చేశాక ఈ రిటర్నబుల్ ప్లాట్లనే నమ్ముకున్న రైతులు.. రుణాలు రాక అప్పుల పాలయ్యారు.

ఇప్పుడు లీడ్ బ్యాంక్ ఇచ్చిన ఆదేశాలతో రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి. దీంతో రైతులు బ్యాంకులకు క్యూ కట్టబోతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల భేటీలో రుణాలిచ్చేందుకు బ్యాంకులు అంగీకరించాయి. కానీ రుణాలు మాత్రం రావడం లేదు. దీంతో తాజాగా రైతులు సీఎం చంద్రబాబుతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు లీడ్ బ్యాంక్ ఇతర బ్యాంకులకు తాజా ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications