రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత!
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఆర్- 5 జోన్ ఏర్పాటు పనులను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. కృష్ణాయపాలెం, ఐనవోలు, నిడమర్రు, యర్రబాలెం, మందడం తదితర గ్రామాల్లో సీఆర్డీయే చర్యలు కోర్టు ధిక్కరణే అంటూ నిరసన చేపట్టారు. హైకోర్టులో ఉన్న అంశంపై చట్టవ్యతిరేకంగా చర్యలకు దిగడం దారుణమన్నారు. పొక్లెయిన్లతో ఐనవోలు సమీపంలో జంగిల్ క్లియరెన్స్ చేపట్టిన అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఐనవోలుతోపాటు ఇతర గ్రామాల్లో రైతులు ఆందోళన చేపట్టారు.
రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతి(Amravati)లోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు వీలుగా బృహత్ ప్రణాళికలో మార్పులు చేసి ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో తాజాగా విచారణ ముగిసింది. పిటిషనర్లతోపాటు, ప్రభుత్వం తరఫు వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పును రిజర్వుచేసి పెట్టింది.

రాజధానిలో ఆర్-5 జోన్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం అన్నదాతల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా గెజిట్ జారీ చేసింటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ప్రభుత్వం ఆర్-5 జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది.
ఇది న్యాయమైన విషయని, లబ్ధిదారులు వారి సొంత గ్రామాల్లో ఎందుకు అర్హత పొందలేకపోయారని, వారి అర్హతలేంటని రైతులు ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో నివసించే రైతులకు, పేదలకు, అసైన్డ్ రైతులకు ఇవ్వకుండా బయట వ్యక్తులకు ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు ఉద్యమం చేస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకుంది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications