హైకోర్టు అమరావతి తీర్పుపై సుప్రీంకు రైతులు- విపక్షాలపై మంత్రి రోజా విసుర్లు...
ఏపీలో అమరావతి రాజధానిలో ఇళ్ల స్ధలాల పంపిణీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే అమరావతిలో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం వైసీపీ సర్కార్ ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి వాటిని పంపిణీ చేసేందుకు జీవో 45 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులకు నిన్న భంగపాటు ఎదురైంది. రైతులు దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో వారు ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అమరావతి రాజధానిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి ఇళ్ల స్ధలాల కోసం ఆ ప్రాంతాన్ని కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన రైతులకు అక్కడ ఊరట దక్కలేదు. అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వొద్దా అంటూ ప్రశ్నించిన హైకోర్టు ఛీఫ్ జస్టిస్.. రైతుల పిటిషన్లను తోసిపుచ్చారు. అయితే రాజధానిపై సుప్రీంకోర్టు తుది తీర్పుకు లోబడి తన ఆదేశాలు ఉంటాయని తెలిపారు. దీంతో ఇవాళ రైతులు దీనిపై సుప్రీంకోర్టు మెట్లెక్కారు.

అమరావతిలో ఇళ్ల స్ధలాల కేటాయింపును సమర్ధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇవాళ రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో గతంలో రాజధాని అవసరాల కోసం తాము ఇచ్చిన, ప్రభుత్వం కేటాయించిన భూముల్ని తిరిగి ఇళ్లస్ధలాల కోసం కేటాయించేలా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. దీంతో ఈ వ్యవహారం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. గతంలో హైకోర్టులోనే ఈ వ్యవహారం తేల్చుకోవాలని రైతులకు సుప్రీంకోర్టు సూచించడంతో వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మరోవైపు పేదలకు ఇళ్ల స్థలాలివ్వడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విపక్షాలకు చెప్పుదెబ్బ అని పర్యాటక శాఖ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. అనంతపురంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన రోజా..రాజధాని స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని వైసిపి ప్రభుత్వం ఆలోచిస్తే, దాన్ని చంద్రబాబునాయుడు ఇవ్వకుండా అడ్డుపడే ప్రయత్నం చేసారని విమర్శించారు. ప్రజా రాజధాని అని అధికారంలో ఉండగా చంద్రబాబు చెప్పారని, కానీ ఆ రాజధానిలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు.












Click it and Unblock the Notifications