జీఎన్ రావు కమిటీపై రైతుల ఆగ్రహం: అమరావతిలో ఉద్రిక్తత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిపై జీఎన్ రావు కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శుక్రవారం రాత్రి సచివాలయం-మందడం వై జంక్షన్ వద్ద భారీ సంఖ్యలో రైతులు ధర్నా చేశారు.
రహదారికి అడ్డంగా జేసీబీని పెట్టి.. ధర్నా చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీఎన్ రావు కమిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని రైతులు ఆరోపించారు. రైతులకు తీవ్ర అన్యాయం చేశారని ఏపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో వరద ముంపు వస్తుందని చెబితే.. విశాఖలో పరిస్థితి ఏంటని రైతుల ప్రశ్నించారు.
సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు రైతులు యంత్నించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులు, పెద్ధ ఎత్తున మహిళలు తరలివచ్చి సచివాలయం వద్ద బారికేడ్లను దాటేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

తమను ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. ఇప్పుడు ఇలా తమకు అన్యాయం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని మహిళా రైతులు అన్నారు. 6 జిల్లాలతో తమకు రాష్ట్రం ఏర్పాటు చేయాలని, తాము ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు.

కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ నివేదికను వైఎస్ జగన్ సర్కారు పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. మంత్రి బొత్స సత్యనారాయణ ముందే చెప్పినట్లుగా అమరావతి ముంపు ప్రాంతమని జీఎన్ రావు కమిటీ కూడా చెప్పిందని మండిపడ్డారు. తమను రోడ్లపైకి తీసుకొచ్చారని, అడ్డుక్కునే పరిస్థితికి దిగజార్చారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయానికి తగ్గట్టుగానే నివేదిక ఇచ్చామని జీఎన్ రావు కమిటీ తెలిపింది. కాగా రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రికరణ జరగాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే అభివృద్ది కోసం రెండెంచల విధానాన్ని సూచించామని చెప్పారు. వైజాగ్‌లో సెక్రటేరియట్ తోపాటు సమ్మర్ , సీఎం క్యాంప్ ఆఫీసు, వేసవి అసెంబ్లీతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించినట్టు జీఎన్ రావు కమిటీ వెల్లడించింది. కాగా తుళ్లూరు, వైజాగ్‌లో హైకోర్టు బెంచ్‌లు ఎర్పాటు చేయాలని రికమెండెషన్ చేసినట్టు చెప్పింది. వైజాగ్‌లో సెక్రటేరియట్‌తో పాటు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అమరావతిలో అసెంబ్లీతోపాటు సీఎం క్యాంపు కార్యాలయం కూడా ఉండనుంది.












Click it and Unblock the Notifications