నవంబర్ 1 నుండి అమరావతి రైతుల మహాపాదయాత్ర; అనుమతించిన పోలీసులు కానీ కండీషన్స్ అప్లై !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా చేయాలని ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తున్న అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర నిర్వహించనున్నారు రాజధాని ప్రాంత రైతులు.

సోమవారం మహా పాదయాత్ర మొదలు... తుళ్ళూరు నుండి తాడికొండకు తొలిరోజు
నవంబరు ఒకటవ తేదీ సోమవారం నుండి న్యాయస్థానం టు దేవస్థానం పేరిట అమరావతి రైతు మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. నవంబర్ 1వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల 5 నిమిషాలకు అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. మహా పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తుళ్లూరు రైతు దీక్ష శిబిరంలో కాలభైరవ, లక్ష్మీ గణపతి, నవగ్రహ హోమాలు చేయనున్నారు. హోమానికి ముందు మహిళా రైతులు సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా రైతులు ఏడు కిలోమీటర్ల దూరంలోని పెదపరిమికి చేరుకొని అక్కడ భోజనం చేయనున్నారు. ఇకఅక్కడ నుండి మరో ఏడు కిలోమీటర్లు నడిచి తాడికొండలో రాత్రికి బస చేస్తారు. ఈ మహా పాదయాత్ర నవంబర్ 1 నుండి నవంబర్ 17 వరకు జరగనుంది.

రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వని పోలీసులు, కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు పోలీసుల అనుమతి
రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసిన రైతుల విజ్ఞప్తిని పోలీసులు నిరాకరించారు శాంతిభద్రతల దృష్ట్యా మహా పాదయాత్ర కు అనుమతి ఇవ్వలేమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అమరావతి పరిరక్షణ సమితి కి లేఖ రాశారు. దీంతో రాజధాని రైతులు మహా పాదయాత్ర కు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు రైతు మహా పాదయాత్ర శుక్రవారం అనుమతి ఇవ్వడంతో శనివారం పోలీసులు అనుమతిని ఇస్తున్నట్టు వెల్లడించక తప్పలేదు.

మహాపాదయత్రకు అనుమతిచ్చినా షరతులు విధింపు .. షరతులివే
రాజధాని రైతుల మహా పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ కొన్ని షరతులను విధించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే మహా పాదయాత్ర కొనసాగించాలని డిజిపి గౌతమ్ సవాంగ్ సూచించారు. పాదయాత్ర సందర్భంగా డీజే వంటి సౌండ్ సిస్టం లు ఉపయోగించకూడదని, 1,2 పోర్టబుల్ హ్యాండ్ మైక్ లు మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు హై కోర్టుకు సమర్పించిన జాబితాలో ఉన్న 157 మంది మాత్రమే మహా పాదయాత్రలో పాల్గొనాలని స్పష్టం చేశారు. అలాగే పాదయాత్రలో పాల్గొన్న వారు కచ్చితంగా ఐడి కార్డులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.

రైతుల మహాపాదయత్రకు బందోబస్తు .. అలాగే వీడియో చిత్రీకరణ
రైతుల పాదయాత్రకు ఆయా జిల్లాలలో పోలీసులు రక్షణ కల్పించాలని బందోబస్తు ఏర్పాట్లు చేయాలని డిజిపి ఆదేశాలు జారీ చేశారు. రైతుల పాదయాత్ర జరిగే జిల్లాలలో గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి నగర పోలీసు ఉన్నతాధికారులకు మహా పాదయాత్ర కు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని, వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశించారు. పాదయాత్రకు అనుమతినిస్తూనే షరతుల పేరుతో రైతుల పాదయాత్రపై పోలీసులు నిఘా పెట్టనున్నారు.
Recommended Video

తుళ్ళూరు టూ తిరుపతి.. రైతుల మహా పాదయాత్ర
ఇదిలా ఉంటే కోర్టు అనుమతితో నవంబర్ 1వ తేదీన తొలిరోజు తుళ్లూరు నుంచి తాడికొండ వరకూ పాదయాత్ర సాగించనున్నారు అమరావతి ప్రాంత రైతులు. ప్రజల మద్దతు కోసం సాగుతున్న ఈ మహా పాదయాత్రలో రాజధాని రైతులు తుళ్లూరు నుండి తాడికొండ, గుంటూరు అమరావతి రోడ్డు, పుల్లడిగుంట, ఏటుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, కోవూరు, వెంకటగిరి, శ్రీ కాళహస్తి, రేణిగుంట, తిరుపతి, అలిపిరి మార్గంలో తిరుమలకు చేరుకుంటారు రాజధాని ప్రాంత రైతులు.












Click it and Unblock the Notifications