కోట్లు పలుకుతున్న ప్లాట్లు: రాజధాని అమరావతి రైతులకు కొత్త సమస్య

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో రైతులు మరో కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతుల మీదగా ఇటీవలే ప్లాట్లు ఇచ్చారు. మెట్ట ప్రాంతాల్లో ఎకరం భూమి ఇచ్చిన రైతుకు ప్రభుత్వం 1250 చదరపు గజాల స్థలాన్ని ఏపీ ప్రభుత్వం ఇచ్చింది.

ఇందులో 1000 గజాలను నివాసిత ప్రాంతంలోను, 250 చదరపు గజాల స్థలాన్ని కమర్షియల్ ప్రాంతంలోనూ ఇచ్చింది. అలాగే జరీబు భూమి ఇచ్చిన రైతుకు 1450 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చారు. ఇందులో 1000 చదరపు గజాల స్థలాన్ని నివాసిత ప్రాంతంలోను, 450 చదరపు గజాల స్థలాన్ని కమర్షియల్ ఏరియాలో ఇచ్చారు.

తొలి విడతలో భాగంగా నేలపాడు గ్రామంలో 800 మంది రైతులకు 1100 స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన ఈ ప్లాట్‌లను అక్కడి రైతులు విక్రయించుకునేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతిలో గజం భూమి విలువ రూ.15000 నుంచి రూ. 20000 వరకు పలుకుతోంది.

amaravati farmers not to sale his flats distributed by govt of ap

ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని విక్రయించుకొని సొమ్ము చేసుకుందామనుకున్న రైతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సీఆర్డీఏ పరిధిలోని భూముల క్రయ, విక్రయాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ భూమికి సంబంధించి సీఆర్డీఏ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందిన రైతులు మాత్రమే భూములను విక్రయించుకునే సదుపాయం కల్పించింది.

అయితే ప్లాట్‌ల విక్రయానికి ఈ సదుపాయాన్ని కల్పించలేదు. ప్రభుత్వం ప్లాట్లను కేటాయించిన తరుణంలో నేలపాడులో భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. రాజధాని రాక ముందు ఎకరా ఏడు లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకూ ఉండేది. రాజధాని ప్రకటించిన తరువాత ఇదే భూమి సుమారు రూ. కోటి పలికింది.

ఇప్పుడు ప్లాట్‌లుగా మారడంతో ఇదే భూమి కోటిన్నర నుంచి రూ. 3 కోట్ల వరకూ పలుకుతోంది. ఈ క్రమంలో తమ ప్లాట్‌లను వేరే వ్యక్తులకు అమ్ముకుంటే పెద్దమొత్తంలో ధర పలుకుతోందని భావిస్తున్న రైతులకు ప్రభుత్వం నిబంధన కాస్తంత ఇబ్బందిగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh new capital Amaravati farmers not to sale his flats distributed by govt of ap.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి