పాదయాత్రలో అమరావతి మహిళా రైతులకు అవమానం
అమరావతి మహిళా రైతులకు పాదయాత్రలో మరో అవమానం ఎదురైంది. ప్రతిరోజు మీరు పాదయాత్రలో నడుస్తున్నందుకు రోజుకు రూ.200 ఇస్తున్నారా? లేదంటే రూ.300 ఇస్తున్నారా? అంటూ అర్చకుడు వ్యాఖ్యానించారు. చాలా బాధగా, అవమానకరంగా అనిపించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో అమరావతి రైతులు సెప్టెంబరు 12వ తేదీ నుంచి 60 రోజులపాటు మహా పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా వారు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని లక్ష్మీజనార్దనస్వామి కల్యాణ మండపంలో బస చేశారు.

అమ్మవారి దర్శనానికి వెళ్లిన రైతులు
పాదయాత్రకు విరామం రావడంతో పలువురు మహిళా రైతులు సమీపంలోనే ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అర్చకుడు ఉప్పల రమణ అవమానకరంగా వ్యాఖ్యలు చేశారంటూ మహిళా రైతులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ధారపోస్తే రోజు కూలి తీసుకొని పాదయాత్ర చేసేవారిలా కనపడుతున్నామా అంటూ పాపినేని రాజేశ్వరి, తుమ్మల లక్ష్మీజ్యోతి, బత్తుల లీలావతి అర్చకుణ్ని నిలదీశారు.

తోటి అర్చకుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
వారిమధ్య వాగ్వాదం పెరుగుతుండటంతో తోటి అర్చకులు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. అనంతరం అర్చకుడు దేవాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే ఇతర మహిళా రైతులంతా ఆలయం దగ్గరకు చేరుకున్నారు. వారంతా రమణ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారిని దర్శించుకుందామని వస్తే ఇలా అవమానపరిచేలా మాట్లాడటం మనోవేదనకు గురిచేస్తోందంటూ మండిపడ్డారు. దీనిపై ఆలయ ఈవో ను వివరణ కోరగా అర్చకుణ్ని పిలిపించి మాట్లాడామన్నారు. తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పాడన్నారు. తమ ఆలయానికి వచ్చే భక్తులను గౌరవ మర్యాదలతో చూడటం తమ బాధ్యత అన్నారు.

మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన రైతులు
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత పరిధిలోని 29 గ్రామాల రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గతంలో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో వారు 45 రోజులపాటు హైకోర్టు నుంచి అలిపిరి వరకు పాదయాత్ర నిర్వహించారు. రెండో విడతగా శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్యభగవానుడి దేవాలయం వరకు యాత్రను నిర్వహిస్తున్నారు. యాత్ర పొడవునా స్థానికుల నుంచి విశేష స్పందన వ్యక్తమవుతుండటంతో రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.