Amaravati Padayatra: మళ్లీ అమరావతి రైతుల పాదయాత్ర-ఈసారి ఎందుకంటే ?
అమరావతి రాజధాని ప్రాంత గ్రామాల రైతులు మరోసారి పాదయాత్రకు సిద్దమవుతున్నారు. గతంలో అమరావతి నుంచి తిరుమలకు ఓసారి న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర చేసిన రైతులు.. అనంతరం మరో పాదయాత్ర చేపట్టినా అది మధ్యలోనే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మారిన పరిస్ధితుల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతులు మరో పాదయాత్ర చేపట్టేందుకు సిద్దమవుతున్నారు.
గతంలో అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానులు చేపట్టాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు పాదయాత్ర చేశారు. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల పాదయాత్రలకు ఆటంకాలు కల్పించడం, కేసులు నమోదు చేయడం, యాత్రల్ని అడ్డుకోవడం, మూడు రాజధానుల అనుకూల వాదులను రెచ్చగొట్టి వీరిపైకి ఉసిగొల్పడం వంటి చర్యలు చేపట్టింది. కానీ ఇప్పుడు అమరావతికి అనుకూలంగా ఉన్న కూటమి ప్రభుత్వం రావడంతో వారు మరో యాత్ర చేపట్టబోతున్నారు.

అమరావతి రాజధాని ప్రాంత గ్రామమైన వెంకటపాలెం టీటీడీ దేవస్థానం నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టాలని రైతులు నిర్ణయించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని గతంలో మొక్కుకున్న రైతులు.. వీటిని చెల్లించడం కోసం తిరుమలకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు. 15 రోజులపాటు ఈ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.మరోవైపు ఇవాళ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు అమరావతి రైతులు సిద్ధమయ్యారు. సాయంత్రం సచివాలయానికి రానున్న చంద్రబాబుకు మందడం ,వెలగపూడి దీక్షా శిబిరాలలో ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications