సుప్రీంకోర్టు తలుపు తట్టిన అమరావతి రైతులు
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని ఆర్-5 జోన్ అంశంలో దాఖలైన పిటిషన్‌పై వచ్చేవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కట్టా రాజేంద్రవరప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరున ఈ పిటిషన్ దాఖలైంది. దీన్ని వెంటనే విచారణకు స్వీకరించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫు న్యాయవాదులు మెన్షన్ చేశారు. వచ్చే వారం విచారణ చేపడతానని సీజేఐ ప్రకటించారు.
రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసి అన్ని జిల్లాలవారికి ఇళ్ళస్థలాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ప్రాంతం ఎలక్ట్రానిక్ సిటీ నిర్మాణానికి కేటాయించారని, ప్రభుత్వ జీవోను నిలిపేయాలని రైతులు పిటిషన్ వేశారు. అయితే పిటిషన్ నిలిపివేయడానికి నిరాకరిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వీటిని రాజధాని రైతులు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములను ఒప్పందానికి విరుద్ధంగా కేటాయించడంపై స్టే విధించాలని కోరారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు స్వచ్ఛందంగా ఇచ్చామని, రాజధానిలో జరిగే నిర్మాణాల కోసమే ఆ స్థలాలను వినియోగించాలికానీ పేదలకు ఇళ్లస్థలాల కింద ఎలా ఇస్తారంటూ అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే పేదలకు 35 శాతం ఇళ్ళస్థలాలివ్వాలంటూ సీఆర్డీయే చట్టంలోనే ఉందని, కానీ వైసీపీ ప్రభుత్వం 5 శాతమే ఇచ్చిందని హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది తన వాదనలను వినిపించారు. పేదలకు ఇళ్ళస్థలాలివ్వడంలో తప్పు లేదని, కోర్టు కూడా అన్నివర్గాల ప్రజలు రాజధానిలో ఉండాలంటోందనే విషయాన్ని గుర్తుచేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.












Click it and Unblock the Notifications