క్యాంపు ఆఫీసు పేరుతో విశాఖకు రాజధాని ? అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్..
ఏపీలో నాలుగేళ్ల క్రితం మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ దాన్ని అమల్లోకి తీసుకురావడంలో మాత్రం విఫలమవుతోంది. అప్పటికే రాజధానిగా ఉన్న అమరావతి రైతుల అభ్యంతరాలు, న్యాయపరమైన వివాదాల కారణంగా మూడు రాజధాను ప్రక్రియ ముందడుగు పడటం లేదు. ఈ నేపథ్యంలో విశాఖకు కనీసం సీఎం క్యాంపు కార్యాలయాలు అయినా తరలించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. హైకోర్టు గత తీర్పుకు విరుద్ధంగా ఇలా చేయకుండా అడ్డుకోవాలని రైతులు మళ్లీ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు.
అమరావతి నుంచి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కోసం ప్రభుత్వం ఇప్పటికే జీవో నంబర్ 2283 జారీ చేసింది. దీని ప్రకారం అమరావతి నుంచి విశాఖకు వచ్చే కార్యాలయాలు, అధికారుల కోసం భవనాల కేటాయింపు చేసేలా ముగ్గురు సభ్యుల అధికారుల కమిటీ పలు సిఫార్సులు కూడా చేసింది. దీంతో రేపోమాపో అమరావతి నుంచి విశాఖకు సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు మిగతా కార్యాలయాలు కూడా తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షల పేరుతో సీఎం క్యాంపు కార్యాలయం, అధికారుల కార్యాలయాల్ని హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా తరలిస్తున్నారంటూ అమరావతి రైతులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో విశాఖకు కార్యాలయాల తరలింపుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 2283ని అడ్డుకోవాలని కోరారు. అసలు సచివాలయ మ్యాన్యువల్ లో కానీ, బిజినెస్ రూల్స్ లో కానీ సీఎం క్యాంపు కార్యాలయం అనే ప్రస్తావనే లేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు.
అలాగే విశాఖలో అధికారుల కోసం విమ్స్ క్యాంపస్ కేటాయింపు కూడా మెడికల్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో తెలిపారు. ఈ పిటిషన్లో అధికారుల కమిటీలో ఉన్న ముగ్గురు ఐఏఎస్ లతో పాటు డీజీపీ, సీఎస్, ఇతర అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చారు. అలాగే ఈ పిటిషన్లో రుషికొండపై నిర్మాణాల కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టడాన్ని కూడా రైతులు ప్రశ్నించారు. క్యాంపు కార్యాలయం కోసం ఇంత భారీ ఎత్తున ప్రజాధనం ఖర్చు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications