అమరావతి భూకుంభకోణంలో ట్విస్ట్ -చంద్రబాబుపై సీఐడీకి ఆధారాలు -మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు భద్రత పెంపు
అమరావతిలో భూకుంభకోణం వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు సైతం నోటీసులు ఇచ్చిన అధికారులు.. ముందుగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)ను విచారణకు పిలిచారు. సీఐడీ విచారణ అనంతరం ఆర్కే మీడియాతో మాట్లడారు. మరోవైపు ఆ ఎమ్మెల్యే భద్రతకు సంబంధించి జగన్ సర్కారు కీలక ఆదేశాలను జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
కరోనా విలయంలో అద్భుతం -కొవిడ్ యాంటీ బాడీస్‌తో తొలి శిశువు జననం -తల్లి వ్యాక్సిన్ తీసుకోగా

సీఐడీకి ఆధారాలిచ్చాను..
గత టీడీపీ హయాంలో అమరావతిలో అసైన్డ్ భూముల అవకతవకలపై తన దగ్గరున్న సాక్షాదారాలు అన్నింటినీ సీఐడీకి అందించినట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. విజయవాడలోని ఏపీ సీఐడీ కార్యాలయంలో విచారణ ఎదుర్కొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భూములు కోల్పోయిన దళితులు తనకిచ్చిన ఫిర్యాదులను సీఐడీకి అందించానని, మంగళగిరిలో సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూములు మోసం జరిగిందని, తాడికొండలో 3 వేల ఎకరాలు ఇలాగే కొట్టేసారన్న అనుమానం ఉందని, వాటిని కూడా విచారించాలని కోరినట్లు ఆర్కే తెలిపారు.

ఆ చట్టాల ప్రకారం చర్యలు తప్పవు
''ఇన్ సైడ్ ట్రేడింగ్‌కు, సీఐడీ నమోదు చేసిన కేసులకు సంబంధం లేదు. ఇది ప్రత్యేక కేసు. రాజధాని పేరుతో జీవో ఎంఎస్ నెం.41 ను తీసుకొచ్చి భూములు తీసుకున్నారు. ఒక్క దళితుల భూములే కాదు, ఎక్స్ సర్వీస్మెన్‌లకు ఇచ్చిన భూములను కూడా లాగేసుకున్నారు. దళితులకు ఇచ్చిన భూముల అంశంలో 1989 ఎస్సీ, ఎస్సీ యాక్ట్, పీవోటీ 1977 యాక్ట్‌ల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దళితులకు అన్యాయం జరిగితే ఎవరైనా మాట్లాడొచ్చే, ప్రశ్నించొచ్చు'' అని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. నిజంగా..

చంద్రబాబుకు సవాల్..
అమరావతి భూకుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీమంత్రి నారాయణ సహా ఇతరులు ఎవరు ఉన్నా వాళ్లందరినీ న్యాయస్థానం ముందు నిలబెట్టాలని సీఐడీని కోరానని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. నిజంగా చంద్రబాబు ఏ తప్పూ చేయని వ్యక్తి అయితే బహిరంగగా బయటకొచ్చి మాట్లాడాలని, సీఐడీ, కోర్టుల్లో విచారణ ఎదుర్కొవాలని ఆర్కే సవాలు విసిరారు. ఈ కేసులో స్టే కోరుతూ చంద్రబాబు కోర్టుకు వెళ్లడంపై ఆర్కే ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మ్యానేజ్ చేయడానికే చంద్రబాబు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే..

ఎమ్మెల్యే ఆర్కేకు భద్రత పెంపు
అమరావతి భూకుంభకోణంపై ఏపీ సీఐడీ విచారణ కీలక దశకు చేరడం, ఈనెల 23న చంద్రబాబును సైతం విచారించనున్న నేపథ్యంలో అసలు ఫిర్యాదుదారుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భద్రతపై జగన్ సర్కారు కీలక ఆదేశాలిచ్చింది. ఎమ్మెల్యే ఆర్కేకు ఇప్పుడున్న గన్ మెన్లకు అదనంగా మరో నలుగురు గన్‌మెన్లను ప్రభుత్వం కేటాయించింది.