బాబుకు సిగ్గుంటే.., జగన్‌కు అనుభవం లేదనే గెలిపించారు: అంబటి షాక్
గుంటూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సిగ్గు, బుద్ధి, లజ్జ ఉంటే మంత్రి రావెల కిషోర్ బాబును వెంటనే తప్పించాలని, ఆయన అసైన్డు భూమి కొన్నారని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం ధ్వజమెత్తారు. త్వరలో లోకేష్ నుంచి చంద్రబాబు వరకు బండారం బయటపడుతుందన్నారు.
ముద్రగడ పద్మనాభం పైన పథకం ప్రకారం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాపుల విషయంలో చంద్రబాబు అహం ఇంకా చల్లారలేదన్నారు. మందకృష్ణ మాదిగ వెనుక మేం ఉన్నామని చెప్పడం విడ్డూరమన్నారు. జగన్ పైన టిడిపి అసత్య ప్రచారం చేస్తోందన్నారు.
ఏం జరిగినా దాని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పడమేమిటన్నారు. చంద్రబాబు కాపు ద్రోహి కాదా అని మండిపడ్డారు. కాపు జాతి చంద్రబాబును క్షమించదన్నారు. జగన్‌కు అనుభవం లేదని నిన్ను గెలిపిస్తే.. చీకటి వ్యాపారం చేస్తావా అని ధ్వజమెత్తారు.

బినామీల పేరుతో వందల ఎకరాల భూములు కొనుగోలు చేశారన్నారు. ల్యాండ్ పూలింగ్ చేయమని చెబితే మంత్రి నారాయణ ప్రజలను పూల్ చేశారని ఎద్దేవా చేశారు. ముద్రగడ పద్మనాభం తమ సామాజిక వర్గం కోసం.. తమది దరిద్రపు జాతి అనే మాట అంటే దానిని రాజకీయం చేశారని ధ్వజమెత్తారు.
కరకట్ట పైన ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ నుంచి దాని కింద ఉన్నవన్నీ ఆక్రమ నిర్మాణాలు అని ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తు చేశారు. చంద్రబాబు చట్ట వ్యతిరేక పనులకు ఊతమిస్తున్నారన్నారు. చట్టాలను పక్కన పెడితే అడిగే వారికి లేకుండా పోయిందన్నారు.












Click it and Unblock the Notifications