అంబటి మార్క్ రిమార్క్స్
Ambati Rambabu: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి నారా లోకేష్ చేసిన విమర్శలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎదురుదాడి మొదలైంది. రెడ్ బుక్ పేరు ఎత్తితే కొందరికి గుండెపోటు వస్తోందని, మరికొందరు బాత్‌రూమ్‌లో పడిపోతున్నారంటూ ఆయన వేసిన సెటైర్లకు ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
ఎన్టీ రామారావుతోనే
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కన్నుమూతతోనే ఆ పార్టీ కూడా కనుమరుగైందంటూ కౌంటర్ అటాక్‌కు దిగారు. ఇప్పుడున్నది చంద్రబాబు నేతృత్వంలో జరిగిన వెన్నుపోటు నుంచి పుట్టిన టీడీపీనేననంటూ విమర్శించారు. గుంటూరు వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నారు?
తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారు? ఏ పార్టీలో ఉన్నారు? అని అంబటి ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని, అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ అంటూ నారా లోకేష్ చెప్పడాన్ని తప్పుపట్టారు.
టీడీపీని చంద్రబాబే స్థాపించినట్లుగా
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే, ఆదే కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానంటూ ఆనాడు చంద్రబాబు బీరాలు పలికిన విషయం మరిచిపోయారా? ఈ రోజు టీడీపీని చంద్రబాబే స్థాపించినట్లుగా మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని వ్యాఖ్యానించారు.
ఏనాడైనా తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా?
తమది పేదల కోసం ఎగిరేజెండా అని చంద్రబాబు చాటుకుంటున్నారని, నిజానికి- ఏనాడైనా తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా? అంటూ ప్రశ్నించారు. ఎర్రజెండాలు, బీజేపీ, బీఎస్పీ, చివరికి కాంగ్రెస్, జనసేన జెండాలను కూడా తమ పక్కన పెడితే కానీ చంద్రబాబు జెండా ఎగరలేదని చెప్పారు.
హామీల అమలు ఏదీ?
ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళే ధైర్యంలేని పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీదని, దాని గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ చేయాలని అనుకున్నామని, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను అమలు చేయలేకపోతున్నామని చంద్రబాబు చెప్పుకొంటోన్నాడని గుర్తు చేశారు.
రేవు దాటిన తరువాత..
దీన్నే రేవుదాటిన తరువాత తెప్ప తగలేయడం అనేది.. అంటూ అంబటి సెటైర్లు వేశారు. చంద్రబాబు చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఊసరవెల్లి ఆదర్శమని, సిద్దాంతాలతో పనిలేకుండా అధికారమే పరమావధిగా ఎవరితోనైనా జత కడతారని విమర్శించారు.
ఎన్ని పార్టీలో..
అధికారం కోసం బీజేపీతో, తరువాత కమ్యూనిస్టులతో, అనంతరం మళ్లీ బీజేపీతో, ఇప్పుడు జనసేనతో జత కట్టారని, అవసరం తీరిన తరువాత ఆ పార్టీలను పక్కకు తోసేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ ఎండగట్టారు. చంద్రబాబు వారసత్వాన్ని నారా లోకేష్ పుణికిపుచ్చుకున్నారని అంబటి చెప్పారు.
అధికార బలంతో..
రెండో సారి మంత్రి అయిన తరువాత అధికార బలంతో నారా లోకేష్ మాట్లాడుతున్నారని అంబటి విమర్శించారు. తన రెడ్‌బుక్ చూసి రాష్ట్రంలో అందరూ వణికిపోతున్నారని విర్రవీగుతున్నారని, నిజానికి వణికిపోయింది చంద్రబాబేనని పేర్కొన్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలు వెళ్లకుండా విశ్వ ప్రయత్నాలు చేశారని, చివరికి చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్లినప్పుడు కూడా వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయావా అంటూ ప్రశ్నించారు.
అనారోగ్యం పేరుతో
జైలులో చంద్రబాబు అనారోగ్యంతో ఉన్నారని, 750 మంది డ్రగ్స్ తీసుకునే నేరచరిత్ర ఉన్న ఖైదీలు ఉన్న చోట ఆయనను వేశారంటూ లోకేష్ వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా? అని గుర్తు చేశారు. అధికారం ఉందని తన రెడ్‌బుక్ చూసి గుండెపోటు, బాత్రూమ్‌లో జారి పడిపోతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న లోకేష్‌కు ముందుంది ముసళ్ళ పండుగ అని హెచ్చరించారు.
కాంట్రాక్టర్ల కోసం
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి నిర్మాణానికి హుండీలు పెట్టి, చందాలు ఇవ్వమని అడిగారని అంబటి అన్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ చేస్తోన్నారంటూ అంబటి ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్ల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications