పులివెందుల నుంచి అమరావతికి..! వైఎస్ భారతికి టీడీపీ ఆఫర్..!
ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చింది. స్త్రీ శక్తి పేరుతో అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని నిన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలో ప్రారంభించారు. అయితే ఈ పథకంపై వైసీపీ వెంటనే విమర్శలు గుప్పించడం ప్రారంభించింది. వైఎస్ జగన్ పత్రిక సాక్షిలో ఈ పథకంపై వ్యతిరేక కథనాలు కూడా వచ్చాయి.
వీటిపై ఇవాళ టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాత ఘాటుగా స్పందించారు. స్త్రీ శక్తి పథకంపై వైసీపీ పత్రిక సాక్షిలో చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా జీరో ఛార్జీతో పులివెందుల నుంచి అమరావతికి రావొచ్చని పీతల సుజాత సూచించారు. తద్వారా ఈ పథకం ఎలా అమలవుతుందో ఆమెకు తెలుస్తుందన్నారు. ప్రభుత్వం సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకంపై విమర్శలు తగవన్నారు.

మరోవైపు అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు పీతల సుజాత తెలిపారు. ఇందులో భాగంగా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం ఇచ్చామని, గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పి.. ఒక్కరికే పరిమితం చేశారని గుర్తుచేశారు.

అలాగే అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణం, రహదారుల విస్తరణ వంటి అనేక కార్యక్రమాలను వేల కోట్లతో చేపడుతున్నట్లు పీతల సుజాత వివరించారు. ఇదే తరహాలో రాబోయే నాలుగేళ్లలో మరిన్ని పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తామని ఆమె వెల్లడించారు.












Click it and Unblock the Notifications