చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ - కీలక హామీ..!!
ఏపీని వరుస తుఫాన్లు ముంచెత్తుతున్నాయి. ఆర్నాబ్ నుంచి పూర్తిగా కోలుకోకముందే మురసు విరుచుకుపడింది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం దాటిన తరువాత పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను పలు ప్రాంతాల్లో వాయిదా వేసారు. కాగా.. సీఎం చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసారు. కీలక హామీ ఇచ్చారు.
ఏపీలో వరుస తుఫాన్లు కొనసాగుతున్నాయి. ఆర్నాబ్ తుఫాను తో భారీ నష్టం జరిగింది. కేంద్రంతో చేసిన సంప్రదింపులతో ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు కేంద్ర టీంలో ఏపీకి వచ్చాయి. సీఎం చంద్రబాబుతో నూ సమావేశం నిర్వహించారు. దాదాపుగా రూ 4,700 కోట్ల మేర నష్టం పైన నివేదికలు ఇచ్చారు. కాగా, రాష్ట్రంలో మురసు తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం, జరిగిన నష్టం, సహాయక చర్యలపై మాట్లాడారు. ఆర్నబ్ తుఫాను ప్రభావం... ఆ వెంటనే మురసు తుఫాన్ రావడంపై పరిస్థితులను అమిత్ షాకు సీఎం వివరించారు. వివిధ జిల్లాల్లో జరిగిన పంట, ఆస్తి నష్టం గురించి కేంద్ర మంత్రికి తెలియజేశారు. కేంద్ర బృందాన్ని పరిశీలనకు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు.

వరుస తుఫాన్లతో పెరుగుతున్న నష్టం
ఇదే సమయంలో వరుస తుఫాన్ల నేపథ్యంలో తగు సాయంతో ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రి ని సీఎం చంద్రబాబు కోరారు. ఇక.. మురసు తుఫాను ఒంగోలు దక్షిణంగా తీరం దాటడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరగగా, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావటంతో అక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా వేసారు. మరో తుఫాను ఈ నెల 15న పొంచి ఉందనే సమాచారం తో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది.













Click it and Unblock the Notifications
