తిరుమలలో అమిత్ షాకు చేదు అనుభవం: ‘గో బ్యాక్’ అంటూ టీడీపీ, కాన్వాయ్‌పై దాడి, ఉద్రిక్తత
Recommended Video

తిరుమల: కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బయటికొచ్చిన అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైంది.

గోబ్యాక్ అంటూ..
అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర టీడీపీ కార్యకర్తలు అమిత్ షా రాకను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలను ప్రదర్శించారు. 'అమిత్ షా గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. అప్పటికే భారీగా పోలీసులు మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది.

ఏ ముఖం పెట్టుకుని..
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ మోసం చేసిందని, తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని బీజేపీ తుంగలో తొక్కిందని.. ఇప్పుడు మళ్లీ ఏ మొఖం పెట్టుకుని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తిరుమలకొచ్చారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

వాహనం అద్దాలు పగలగొట్టారు..
అమిత్ షా కాన్వానయ్‌ను అట్టుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించగా.. వారిని అక్కడికి చేరుకున్న బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాన్వాయ్ లోని ఓ వాహనం అద్దాలు పగలగొట్టడంతో బీజేపీ శ్రేణులు టీడీపీ శ్రేణులతో ఘర్షణకు దిగాయి. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎస్పీకి ఫిర్యాదు
ఆ తర్వాత అమిత్ షా కాన్వాయ్ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఎంపీపై దాడి దిగడం ఏంటని బీజేపీ నేత భాను ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు టీడీపీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ప్రొటోకాల్ ప్రకారం
అమిత్ షా కాన్వాయ్ వెళుతుంటే.. రహదారి పక్కన ఉన్న పలువురు భక్తులు కూడా హోదా కోసం నినాదాలు చేశారు. కాగా, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన అమిత్ షాకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, ప్రొటోకాల్ ప్రకారం దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు.












Click it and Unblock the Notifications