ఏం చెప్పాలో చెప్పేశాం: ఏపీలో టీడీపీతో పొత్తుపై అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం ఇంతవరకే చెప్పదల్చుకున్నట్లు తెలిపారు. అంతేగాక, ఏం చెప్పాలో చెప్పేశానని అన్నారు.
అయితే, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే విషయంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీని బలోపేతం చేస్తామని అన్నారు. కాగా, ఇప్పటికే ఏపీలో బీజేపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇక తెలంగాణ బీజేపీ గురించి మాట్లాడిన అమిత్ షా.. తెలంగాణలో అధికారంలోకి రావడానికే పార్టీని విస్తరిస్తున్నామని తెలిపారు. 60ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా తెలంగాణకు నిధులిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు లక్ష కోట్లిచ్చినట్లు తెలిపారు.

అమిత్ షా మాట్లాడిన అనంతరం తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ టీడీపీకి చెందిన మంత్రులున్నారని, ఏపీ ప్రభుత్వంలో తమ పార్టీ నేతలు మంత్రులుగా ఉన్నారని చెప్పారు. ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని చెప్పారు.
తెలంగాణలో మాత్రం స్వతంత్రంగా బీజేపీ బలపడాలని చూస్తున్నామని తెలిపారు. పొత్తులు మాత్రం ఎన్నికల సమయంలో ఉంటాయని అన్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తున్నామని కిషన్ తెలిపారు. బీజేపీని ఏ పార్టీ శాసించలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీకి అండగా ఉంటున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications