అమిత్ షాకు చంద్రబాబు ఫోన్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నేతలంతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు షాకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ట్విటర్, ఫేస్ బుక్ ఉపయోగించుకోగా బాబు మాత్రం నేరుగా ఫోన్ చేసి రాజకీయంగా మరోసారి అనేక ఊహాగానాలకు తావిచ్చేలా చేశారు.

ఢిల్లీ పెద్దల ఆలోచన తెలియడంలేదే..
ఫోన్ చేసిన తర్వాత శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఇతర విషయాలు మాట్లాడుకోకుండా ఉంటారా? అనే సందేహం అందరిలో తలెత్తింది. చంద్రబాబుకు కావల్సింది కూడా అదే. రాజకీయంగా కొత్త సమీకరణలకు తెరలేపుతున్న బాబు ఆ తరహా వార్తలే ప్రచారంలోకి రావాలని కోరుకున్నారు. మరోవైపు సునీల్ ధియోధర్ లాంటివారు టీడీపీతో పొత్తు లేదని, జనసేన మాత్రమే తమ మిత్రపక్షమని చెబుతున్నారు. ఢిల్లీ పెద్దల ఆలోచన ఏమిటన్నది స్పష్టత లేదు. అయితే వారితో పరిచయాలు పెంచుకునేందుకు మాత్రం చంద్రబాబు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.

బీజేపీ వైఖరితో విసిగిపోయిన పవన్?
కొందరేమో 2014 పొత్తులు మళ్లీ వస్తాయంటారు.. మరికొందరు ఈ రెండు పార్టీలు కలిసే ప్రసక్తే లేదు అంటారు. మరోవైపు వీరు మిత్రపక్షమని చెబుతున్న పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీ వైఖరితో విసిగిపోయినట్లు పరోక్షంగా చెప్పారు. రోడ్ మ్యాప్ అడిగినా ఇవ్వలేదని, అందుకే తన నిర్ణయం తాను తీసుకున్నానని ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన రెండు గంటల తర్వాత విజయవాడలో పవన్ తో చంద్రబాబు భేటీ అవడంతోపాటు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ కోరుకునేదేమిటంటే గత ఎన్నికల్లో ఎలాగైతే వైసీపీకి సహకారం అందించారో రాబోయే ఎన్నికల్ తమకు కూడా అటువంటి సహకారాన్ని అందించమని కోరుతున్నారు.

మిత్రుల కోసం అన్వేషిస్తోన్న బీజేపీ?
ఎన్డీయే కూటమి నుంచి చాలావరకు రాజకీయ పార్టీలు బయటకు వెళ్లిపోయాయి. ఒకట్రెండు పార్టీలు మినహా ఎవరూ లేకపోవడంతో బీజేపీ కొత్త మిత్రుల కోసం అన్వేషణ సాగిస్తోంది. అంతేకాకుండా తెలంగాణలో ఎన్నికలు వస్తుండటంతో అక్కడ టీడీపీ సహకారాన్ని బీజేపీ కోరుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీచేద్దామని భావించి టీడీపీ వెనక్కి తగ్గించింది. బీజేపీ తరఫున పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీడీపీ సహకారాన్ని కోరారని, పార్టీ ఓటింగ్ ను మళ్లించాలని కోరినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీడీపీ తరఫున పోటీచేస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన బీజేపీలో చేరారు. టీడీపీ కూడా పోటీ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. బీజేపీకి సహకరించేందుకే వెనక్కి తగ్గిందని వార్తలు వచ్చాయి. చంద్రబాబు కోరుకుంటున్నట్లుగా బీజేపీతో చెలిమికి ఢిల్లీ పెద్దలు అంగీకరిస్తారా? లేదా? అనే విషయంలో స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications