తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా, జగన్: రేపు 29వ దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో భేటీ
తిరుపతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. రంగనాయకుల మండపంలో కేంద్రమంత్రి అమిత్ షా, సీఎం జగన్‌కు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. శేష వస్త్రాలతో టీటీడీ అధికారులు వారిని సత్కరించారు. స్వామివారి చిత్రపటంతో పాటు టీటీడీ డైరీ క్యాలెండర్లను బహుకరించారు. వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అంతకుముందు మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుపతిలోని తాజ్ హోటల్‌కు చేరుకుని అక్కడ బస చేస్తారు హోంమంత్రి అమిత్ షా.

ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాప్టర్‌లో బయల్దేరి నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు. అక్షర విద్యాలయ, స్వర్ణ భారతి ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్ లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమ నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రామీణ స్వయం సాధికారక శిక్షణ సంస్థను సందర్శించారు. మధ్యాహ్నం స్వర్ణ భారతి ట్రస్ట్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
మరోవైపు, రేపటి 29వ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఆధ్యాత్రికం కేంద్ర తిరుపతి వైదికైంది. ఈ సమావేశానికి కేంద్ర హోమంత్రి అమిత్‌షా అధ్యక్షత వహిస్తారు. ఈ మీటింగ్‌కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై హాజరవుతున్నారు. మిగతా రాష్ట్రాల నుంచి సీఎంలకు బదులుగా మంత్రులు, ఉన్నతాధికారులు వస్తున్నట్లు సమాచారం. అయితే, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొంటున్నట్లు సమాచారం.

రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి సమస్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మెుత్తంగా 48 అంశాలపై చర్చ జరగనుంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో ఎజెండాతో ఈ సమావేశానికి వస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న అనేక అంశాలను సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. పునర్ విభజన చట్టంలోని అంశాలు, ఇప్పటివరకు పరిష్కారం కాని సమస్యలతో ఎజెండా సిద్ధమైంది.
దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సూచనలు చేయనున్నారు. బెంగుళూరులో జరిగిన 28వ సదరన్ కౌన్సిల్‌లో తీసుకున్న డెసిషన్స్‌పైనా సమీక్ష చేస్తారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలను 5 జోనల్ కౌన్సిళ్లుగా విభజించి ఈ సమావేశాలు నిర్వహిస్తోంది కేంద్రం. కేంద్ర హోం మంత్రితోపాటు ఇతర ముఖ్యనేతలంతా వస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు..1500 మంది పోలీసులు మోహరించారు.












Click it and Unblock the Notifications